పాకిస్థాన్ క్రికెట్‌లో మరోసారి కొత్త వివాదం చెలరేగింది. యువ ఆటగాడు హైదర్ అలీ బ్రిటన్‌లో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్న సమయంలో ఇప్పుడు ఆటగాళ్లు ఏజెంట్‌కు సంబంధించిన మరో అవినీతి కేసు వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన స్టార్ క్రికెటర్లు నసీమ్ షా, మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్ -హక్, స్పిన్నర్ సయీద్ అజ్మల్ వంటి వారికి ఏజెంట్‌గా వ్యవహరించిన ఒక వ్యక్తిపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) నిషేధం విధించింది.
అవినీతి ఆరోపణలు.. నిషేధం
టెలికామ్ ఏషియా స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్, మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్, ప్రస్తుత ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా వంటి స్టార్ క్రికెటర్లకు ఏజెంట్‌గా వ్యవహరించిన మొగిస్ అహ్మద్‌పై ఈసీబీ అవినీతి ఆరోపణలు కారణంగా నిషేధం విధించింది. కౌంటీ క్రికెట్‍లో ఆటగాళ్ల ఎంపికను ఆర్థిక ప్రలోభాల ద్వారా ప్రభావితం చేయడానికి ప్రయత్నించినందుకు క్రమశిక్షణా ట్రిబ్యునల్ అతడిని ధోషిగా తేల్చింది.

అవినీతి కేసు.. ఈసీబీ చర్య
అంతర్జాతీయ క్రికెటర్స్ అసోసియేషన్ యజమాని అయిన మొగిస్ అహ్మద్.. ఒక కౌంటీ జట్టు ప్రధాన కోచ్‌కు అవినీతి ప్రతిపాదన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈసీబీ ఒక అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. మొగిస్ అహ్మద్ ఒక కౌంటీ జట్టు కోచ్‌కు అవినీతి ప్రతిపాదన చేశాడని.. ఫ్రాంఛైజీ లీగ్‌లో తాను ప్రాతినిధ్యం వహించే కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేసినందుకు బదులుగా, కోచ్‌కు తన కమిషన్‌లో కొంత భాగాన్ని ఇస్తానని చెప్పాడని ఈసీబీ పేర్కొంది.
కోచ్ వెంటనే ఈ విషయాన్ని బోర్డుకు తెలియజేయడంతో విచారణ మొదలైంది. మార్చిలో మొగిస్ అహ్మద్‌పై తాత్కాలిక సస్పెన్షన్ విధించారు. ఆ తర్వాత ట్రిబ్యునల్ అతనికి ఐదేళ్ల నిషేధం విధించింది.ఈ శిక్షలో కనీసం 30 నెలలు తప్పనిసరిగా అనుభవించాలి. మిగిలిన శిక్ష అతని భవిష్యత్ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది.
అజ్మల్, నసీమ్ షాకు ఒప్పందాలు కుదిర్చిన మొగిస్ అహ్మద్
మొగిస్ అహ్మద్‌కు కౌంటీ క్రికెట్ వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉంది. గతంలో సయీద్ అజ్మల్, నజీమ్ షా కోసం అతను ఒప్పందాలు కుదిర్చాడు. అంతే కాకుండా ప్రచార కార్యక్రమాలు, ప్రకటనలలో కూడా పాల్గొన్నాడు. అయితే, ఇటీవల కాలంలో అతను అనైతిక పద్ధతుల కారణంగా అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈ నిషేధం పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.