టీ20 వరల్డ్ కప్-2024 ఛాంపియన్‌గా భారత్ అవతరించింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు టీమిండియా తెరదించింది. గెలుపు ఆశలు లేని స్థితి నుంచి అద్భుతంగా పోరాడి జగజ్జేతగా నిలిచింది. నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (76; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) సత్తాచాటారు. మహరాజ్ (2/23), నోకియా (2/26) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాడాడు. హార్దిక్ (3/20) మూడు వికెట్లు, బుమ్రా (2/18), అర్షదీప్ సింగ్ (2/20) చెరో రెండు వికెట్లతో విజృంభించారు.

అయితే మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారిన సూర్యకుమార్ స్టన్నింగ్స్ క్యాచ్ కొత్త వివాదానికి తెరదీసింది. అది సిక్సర్ అంటూ దక్షిణాఫ్రికా అభిమానులు నెట్టింట పోస్ట్‌లు పెడుతున్నారు. అసలేం జరిగిదంటే.. సౌతాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. హార్దిక్ వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. దాదాపు సిక్సర్‌గా దూసుకెళ్లిన ఈ బంతిని సూర్య బౌండరీ లైన్‌పై చాకచక్యంగా అందుకున్నాడు.
ముందుగా సిక్సర్‌ను అడ్డుకొన్న సూర్య, తర్వాత సమన్వయం కోల్పోవడంతో బంతి గాల్లోకి విసిరేసాడు. బౌండరీ రోప్ దాటి, మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అది సిక్సర్‌గా మారినా, మిల్లర్ నాటౌట్‌గా నిలిచినా ఫలితం మరోలా వచ్చే అవకాశం ఉంది. అయితే క్యాచ్ అందుకునే క్రమంలో సూర్య బౌండరీ రోప్‌ను తాకాడని సౌతాఫ్రికా ఫ్యాన్స్ నెట్టింట్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మైదానంలో అవతలకు వెళ్లే సమయంలో బౌండరీ కదిలినట్లు కనిస్తుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారాయి.