ముంబయి: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తనకు స్నేహితుడని, అందుకే క్రికెట్ మ్యాచులకు ఆహ్వానిస్తున్నానని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోడి అన్నారు. సినీ స్టార్స్ రావడం వల్ల మ్యాచుకు విఘాతం కలుగుతుందని అనుకోవడం లేదని, వారు క్రికెట్ చూడడానికి రావచ్చునని బిసిసిఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా చెప్పారు. సినీ తారలు క్రికెట్ మ్యాచులకు వచ్చి తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని బిసిసిఐకి చెందిన రత్నాకర్ శెట్టి చేసిన ప్రకటన షారూఖ్ ఖాన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. షారూఖ్ ఖాన్ ఓం శాంతి ఓం సినిమాను ఆ విధంగా ప్రమోట్ చేసుకున్నాడనే అర్థం వచ్చేలా రత్నాకర్ శెట్టి అన్నారు. దాంతో తాను ఇక క్రికెట్ మ్యాచులకే రానని షారూఖ్ అన్నారు.
బిసిసిఐ ప్రతినిధి చేసిన ప్రకటనకు తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యానని ఆయన మంగళవారం మేకింగ్ ఆఫ్ ఓం శాంతి ఓం సినిమా పుస్తకావిష్కరణ సభలో అన్నారు. తన కుమారులను క్రికెట్ మ్యాచ్ చూడడానికి తీసికెళ్లాలని, ఆ సమయంలో ఎవరైనా తన సినిమా గురించి అడిగినప్పుడు చెప్పాల్సి వస్తుందని ఆయన అన్నారు. క్రికెట్ మ్యాచ్ ల్లో సినిమాను ప్రమోట్ చేసుకునే గతి తనకు పట్టలేదని ఆయన అన్నారు. తన పిల్లలు అర్యన్, సుహాన్ క్రికెట్ మ్యాచులకు వెళ్తారని, అయితే వారిపై కెమెరా ఫోకస్ చేసి షారూఖ్ ఖాన్ పిల్లలని చెప్పకూడదని బిసిసిఐ అధికారులకు సూచిస్తున్నానని ఆయన అన్నారు.