రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ ఔట్ వివాదాస్పదంగా మారింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ ప్రారంభమైంది. అయితే మొదటి రోజు ఆటకు వరుణుడు తీవ్రంగా ఆటంకం కలిగించడంతో 41 ఓవర్ల పాటు మాత్రే ఆటే కొనసాగింది.
తొలి రోజు ఆట ముగిసేసమయానికి పాకిస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగడంతో పాకిస్థాన్ 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అబ్దుల్లా షఫికీ (2), షాన్ మసూద్ (6), బాబర్ అజామ్ (డకౌట్) నిరాశపరిచారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సౌద్ షకీల్ (57 నాటౌట్; 92 బంతుల్లో, 5 ఫోర్లు)తో కలిసి ఓపెనర్ సయీమ్ అయుబ్ (56; 98 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.

వీరిద్దరు అర్ధశతకాలు సాధించి నాలుగో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. అయితే షాన్ మసూద్ ఔట్ చర్చనీయాంశంగా మారింది. తాను నాటౌట్ అంటూ పాక్ కెప్టెన్ అంపైర్లతో వాగ్వాదానికి కూడా దిగాడు. అసలేం జరిగిందంటే.. షోరిపుల్ ఇస్లామ్ వేసిన బంతిని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించి మసూద్ విఫలమయ్యాడు.
బంతి మసూద్ ప్యాడ్-బ్యాటుకు మధ్య నుంచి వెళ్తూ బంగ్లా వికెట్ కీపర్ లిటన్ దాస్ చేతుల్లో పడింది. అంపైర్లు తొలుత నాటౌట్ ప్రకటించగా బంగ్లాదేశ్ సమీక్షకు వెళ్లింది. రివ్యూలో అల్ట్రాఎడ్జ్ పాజిటివ్‌గా రావడంతో థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. అయితే బంతి ప్యాడ్‌కు తాకిందని, బ్యాటుకు కాదని పాకిస్థాన్ కెప్టెన్ వాదన. మొత్తంగా అంపైర్లతో వాదించిన మసూద్ అసంతృప్తిగా మైదానాన్ని వీడాడు. ఈ ఔట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.