Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీలో శనివారం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. కానీ ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ఒక తప్పిదం జరిగింది. నిజానికి ఆస్ట్రేలియా జాతీయగీతానికి బదులుగా భారత జాతీయ గీతాన్ని పొరపాటున ప్లే చేశారు. ఈ సంఘటన పాకిస్థాన్‌లో లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగింది. నిర్వాహకులు వెంటనే తమ తప్పును సరిదిద్ధుకున్నారు. కానీ ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్టు ఐసీసీ నుంచి సమాధానం కోరింది.
ఈ సంఘటనపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరుతూ పీసీబీ ఐసీసీకి లేఖ పంపినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీలో జట్ల జాతీయ గీతం ప్లే జాబితాకు వారి సిబ్బందే బాధ్యత వహిస్తున్నందున.. ఐసీసీ దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పీసీబీ స్పష్టం చేసింది. భారత్ పాకిస్థాన్ లో ఆడడం లేదు కాబట్టి.. వారి ప్లే జాబితాలో పొరపాటున భారత జాతీయ గీతం ఎలా ప్లే అయిందో అర్థం చేసుకోవడం కష్టమని పీసీబీ వర్గాలు వెల్లడించాయి.
India vs Pakistan Live స్కోరు కార్డు

లోగోలో కనిపించని పాక్ పేరు..
శుక్రవారం దుబాయ్ లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో తమ పేరు లోగోను టెలివిజన్ స్క్రీన్ లపై ప్రదర్శించకపోవడంపై పీసీబీ ఐసీసీకి లేఖ రాసింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ల ఫుటేజ్ లలో ప్రసార సమయంలో ఎగువ ఎడమ మూలలో టోర్నమెంట్ లోగో లో పాకిస్థాన్ ఆతిథ్య దేశంగా మూడు లైన్ల బ్రాండింగ్ ఉంది. కానీ భారత్ మ్యాచ్ సమయంలో అది కనిపించలేదు. ఈ క్రమంలో భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లైవ్ లోగోలో పాక్ పేరు లేకపోవడంతో ఐసీసీకి పీసీబీ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో దుబాయ్ లో జరిగే అన్ని మ్యాచ్ లలో పాకిస్థాన్ పేరు ఉండేలా మూడు లైన్ల లోగోను ఉపయోగిస్తామని ఐసీసీ హామీ ఇచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.తప్పును ఐసీసీ అంగీకరించినట్లు తెలిసింది.
టీమిండియా పాకిస్థాన్ వెళ్లలేదు..
ఈ పొరపాటు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఈ టోర్నమెంట్ మొత్తంలో భారత జట్టు పాకిస్థాన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడడం లేదు. భారత్, పాక్ మధ్య రాజకీయ ఉద్రిక్తత కారణంగా టీమిండియా తన అన్ని మ్యాచ్ లను దుబాయ్ లోనే ఆడుతోంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అలాంటి పొరపాటును చేయడం నిజంగా వింతగా ఉంది.