
హైదరాబాద్: పాకిస్థాన్‌లో జరిగిన తాజా ఎన్నికల్లో పాక్ మాజీ క్రికెటర్, రాజకీయనాయకుడు ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ ఈ సారి అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. 1992లో పాక్‌కు వరల్డ్ కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ క్రీడలకు వీడ్కోలు పలికిన తర్వాత తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ స్థాపించారు.
రెండు దశాబ్దాల పోరాటం తర్వాత ఆయన పాక్‌కు ప్రధాని కాబోతున్నారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో పీటీఐ 272 స్థానాలకు 115 గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇమ్రాన్ ఖాన్.. పాక్ ప్రధాని పదవి చేపడుతారంటున్న తరుణంలో పాక్ మాజీ క్రికెటర్లతో పాటు భారత క్రికెటర్లు సైతం అభినందనలు తెలుపుతున్నారు.
తాజాగా, ఇమ్రాన్ ఖాన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ "ఇమ్రాన్‌కు అభినందనలు. ఆయన చాన్నాళ్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు పాకిస్థాన్‌కు ప్రధాని కాబోతున్నారు' అని క్యాబ్ వార్షిక పురస్కారాల వేడుకలో గంగూలీ అభినందించారు.
కాగా, ఈ కార్యక్రమంలో అండర్-19 పేసర్ ఇషాన్ పోరెకు అత్యుత్తమ అండర్-19 క్రికెటర్ అవార్డు లభించగా, టీమిండియా క్రికెటర్ దీప్తి శర్మకు అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డుని అందజేశారు. బెంగాల్ మాజీ క్రికెటర్ బరున్ బుర్మాన్‌ను కార్తీక్ బోస్ జీవిత కాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు.
మరోవైపు పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్లు సైతం ఇమ్రాన్ ఖాన్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు తెలిపిన వారిలో మహ్మద్ అమీర్, మహ్మద్ హఫీజ్, వకార్ యూనిస్, రమీజ్ రాజా, వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ తదితరులు ఉన్నారు.