
అహ్మదాబాద్: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు కరోనా బారిన పడిన టీమిండియా స్టార్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ కోలుకున్నారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వారికి కోవిడ్ నెగెటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో వారు నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొని బ్యాటింగ్ చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కాగా బౌలర్ నవదీప్ సైనీ కూడా కరోనా నుంచి కోలుకుని సోమవారమే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ బుధవారం జరగనున్న రెండో వన్డే మ్యాచ్‌కు ధావన్, శ్రేయస్ అయ్యర్, నవదీప్ సైనీని దూరంగా ఉంచనున్నట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ వీరు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నారు. అందుకే రెండో వన్డేకు కూడా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కాగా కరోనా బారిన పడిన ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఇంకా ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతను కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, నవదీప్ సైనీతో సహా నలుగురు సహాయక బృందం కూడా కరోనా బారినపడ్డారు. దీంతో వీరందరినీ బీసీసీఐ సపరేటుగా ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించింది. దీంతో వీరంతా వెస్టిండీస్‌తో తొలి వన్డే మ్యాచ్‌కు దూరమయ్యారు. అలాగే రెండో వన్డేకు కూడా దూరంకానున్నారు. ముందు జాగ్రత్తగా ఇషాన్ కిషన్‌తోపాటు షారూక్ ఖాన్, మయాంక్ అగర్వాల్‌ను బీసీసీఐ జట్టులో కూడా చేర్చింది. అలాగే మయాంక్ అగర్వాల్‌తోపాటు వ్యక్తిగత కారణాలతో తొలి వన్డే మ్యాచ్‌కు దూరమైన కేఎల్ రాహుల్ కూడా రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడు. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ జట్టులో చేరడంతో టీం మరింత బలోపేతం అవుతుందని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఈ విషయమై సంతోషిస్తున్నట్లు చెప్పాడు. అయితే తుది జట్టులో ఎవరు ఉంటారనేది టీమ్ మెనేజ్‌మెంట్ నిర్ణయిస్తుందని తెలిపాడు.
కాగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 4 వికెట్లతో చెలరేగిన యజుర్వేంద్ర చాహల్ మ్యాన్ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు, ప్రసిద్ద్ కృష్ణ 2, సిరాజ్ ఒక వికెట్‌తో రాణించారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 60 పరుగులతో రాణించాడు. స్కోర్లు: వెస్టిండీస్ 176 ఆలౌట్. ఇండియా: 178-4.