హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌పై టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ ఎడిషన్ కోసం నిర్వహించే వేలంలో ప్రాంఛైజీలు బెన్ స్టోక్స్‌పై కాసుల వర్షం కురిపించడం ఖాయమని పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్‌తో టీ20 సిరిస్ ముగిసిన అనంతరం బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో యువరాజ్ మాట్లాడుతూ 'బెన్ స్టోక్స్ ఓ అద్భుతమైన హిట్టర్, ఫాస్ట్ బౌలర్, ఫీల్డర్. వేలంలో అతడు ఖచ్చితంగా మంచి ధరను పొందుతాడు. ఐపీఎల్‌లో తప్పక రాణిస్తాడు' అని చెప్పాడు.

ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొంటే వారి స్కిల్స్ ఇంకా మెరుగవుతాయని అన్నాడు. భిన్న పరిస్థితుల్లో సాధ్యమైనన్ని మ్యాచ్‌లు ఆడితే అది వారికే లాభిస్తుందని యువీ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో ఆడటాన్ని తానెప్పుడూ ఆస్వాదిస్తానని యువీ చెప్పుకొచ్చాడు.
'మైదానంలో బెన్, కోహ్లీ దూకుడుగా ఆడటాన్ని చూశాం. క్రికెట్ పట్ల వారిద్దరి నిబద్ధత అమోఘం. ఇంగ్లాండ్ ఆటగాళ్లతో పరిహాసం ఆడటం మాకు మామూలే. గతంలో ఆండ్రూ ఫ్లింటాప్‌తో నేను చాలా సార్లు ఇలా చేసే వాడని' అని యువీ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ వేలం ఈ శనివారం (ఫిబ్రవరి 4)వ తేదీన జరుగనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత మళ్లీ ఫిబ్రవరి మూడో వారానికి వాయిదా పడినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ కూడా ఐపీఎల్ వేలంను అధికారికంగా ప్రకటించలేదు. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ ఎడిషన్ ఏప్రిల్ 5 నుంచి మే 21 వరకు జరగనుంది.