Commonwealth games 2022 : ‘మంధనా’ధన్ బ్యాటింగ్.. పాకిస్థాన్ చిత్తుచిత్తు

బర్మింగ్‌హామ్ : ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కొనసాగుతోన్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా జరుగుతున్న క్రికెట్ పోటీలో భారత మహిళా జట్టు నేడు పాకిస్థాన్ మహిళా జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా జరిగిన ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్ 18ఓవర్లకు కుదించడం జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 18ఓవర్లలో 99పరుగులకు ఆలౌట్ అయింది. కాగా 100పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా కేవలం 11.4ఓవర్లలోనే 2వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (42బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లతో 63పరుగులు నాటౌట్) బౌండరీలతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి క్రీజులో చివరి వరకు నిలబడడంతో ఇండియా ఘన విజయం సాధించింది.

ఓపెనర్ల ధాటికి 6ఓవర్లకే 61పరుగులు
తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ బ్యాటర్లు.. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయారు. ఆ జట్టు బ్యాటర్లలో మునిబా అలీ (32పరుగులు 30బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సర్) మినహా మిగతా వాళ్లెవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో స్నేహ రాణా నాలుగు ఓవర్లలో 15పరుగులు మాత్రమే ఇచ్చి 2వికెట్లు ఇచ్చి చెలరేగింది. ఆమెతో పాటు రాధాయాదవ్ 2, రేణుక సింగ్, మేఘన సింగ్, సఫాలీ వర్మ తలా ఓ వికెట్ తీసి పాక్ పతనాన్ని శాసించారు. ఇక 100పరుగుల టార్గెట్‌ను భారత బ్యాటర్లు అలవోక చేదించారు. మంధాన చూడచక్కని షాట్లతో ఆది నుంచే పాక్ బౌలర్లపై ఆధిపత్యం చలాయించింది. 2వ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో టచ్ లోకి వచ్చిన మంధాన మూడో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి స్కోరు బోర్డు మూమెంటమ్ పెంచేసింది. 4ఓవర్లో సఫాలీ వర్మ సిక్స్, ఫోర్ కొట్టగా, మంధాన ఫోర్ కొట్టింది. వీరిద్దరి ధాటికి స్కోరు బోర్డు 6ఓవర్లకే 61పరుగులకు చేరుకుంది.

సిక్స్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మంధాన
ఇక 61పరుగుల వద్ద సఫాలీ వర్మ (16పరుగులు 9బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) ఔటయినప్పటికీ.. మంధాన మాత్రం తన దూకుడును కొనసాగించింది. 8వ ఓవర్లో అద్భుతమైన సిక్స్ బాది మంధాన తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆమెకు జతకూడిన సబ్బినేని మేఘన సైతం 9వ ఓవర్లో చివరి రెండు బంతులకు వరుసగా రెండు ఫోర్లు బాదింది. అయితే ధాటిగా ఆడే ప్రయత్నంలో మేఘన (14పరుగులు 16బంతుల్లో 2ఫోర్లు) బౌల్డ్ అయింది. ఇక అప్పటికే భారత విజయం ఖాయమయిపోయింది. ఇక చివరికి రోడ్రిగ్స్ (2)తో కలిసి మంధాన విజయ లాంఛనాన్ని ముగించింది.

తొలి స్థానానికి భారత్
ఇక పాయింట్ల టేబుల్లో గ్రూప్ ఏలో భారత్ ఈ విజయంతో తొలి స్థానానికి చేరుకుంది. భారత్ 2 మ్యాచ్‌లలో 1గెలుపు, 1ఓటమితో 2పాయింట్లు సాధించడంతో పాటు నెట్ రన్ రేట్ +1.520 నెట్ రన్ రేట్ సాధించింది. ఇక బార్బడోస్, ఆస్ట్రేలియా తలా ఓ విజయంతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి 0పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

తుది జట్లు :
పాకిస్థాన్ వుమెన్స్ (ప్లేయింగ్ XI): ఇరామ్ జావేద్, మునీబా అలీ (వికెట్ కీపర్), ఒమైమా సోహైల్, బిస్మా మరూఫ్ (కెప్టెన్), అలియా రియాజ్, అయేషా నసీమ్, కైనత్ ఇంతియాజ్, ఫాతిమా సనా, తుబా హసన్, డయానా బేగ్, అనమ్ అమీన్
భారత్ వుమెన్స్ (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్, రేణుకా సింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications