
బెంగళూరు: ప్రఖ్యాత కామెంటేటర్, ప్రజెంటేటర్ చారు శర్మ ఆక్షనీర్ అవతారం ఎత్తారు. బెంగళూరు వేదికగా రసవత్తరంగా కొనసాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. 15వ ఎడిషన్ వేలంపాటలో మెరిశారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం 3:45 నిమిషాలకు పునఃప్రారంభమైన ఐపీఎల్ వేలంపాటను ఆయనే కొనసాగించారు. అప్పటిదాకా ఆక్షనీర్‌గా కనిపించిన హ్యూ ఎడ్మెడెస్ స్థానంలో చారు శర్మ డయాస్ మీద కనిపించారు.
శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగ కోసం బిడ్డింగ్ నిర్వహిస్తోన్న సమయంలో ఎడ్మెడెస్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీనితో వేలంపాటను అర్ధాంతరంగా నిలిపివేశారు. అదే సమయంలో మధ్యాహ్న భోజన విరామాన్ని తీసుకున్నారు. ఎడ్మెడెస్ కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం.. హైపోటెన్షన్ అని తేలింది. పోస్టురల్ హైపోటెన్షన్ వల్ల ఎడ్మెడెస్ అస్వస్థతకు గురయ్యాడని డాక్టర్లు నిర్ధారించారు.
తొలుత గుండెపోటు అనే ప్రచారం సాగినప్పటికీ..కారణం అది కాదని డాక్టర్లు స్పష్టం చేశారు. ఆయనకు హోటల్‌లోనే చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విశ్రాంతి తీసుకుంటే సాధారణ స్థితికి చేరుకుంటుందని పేర్కొన్నారు. భోజన విరామం అనంతరం చారు శర్మ ఎంట్రీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం.. 3:30 గంటలకు వేలంపాట ఆరంభం కావాల్సి ఉన్నప్పటికీ.. కొంత ఆలస్యమైంది. 3:45కు పునఃప్రారంభమైంది. చారు శర్మ ఆక్షనీర్‌గా కొనసాగింది.