హైదరాబాద్: టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ జట్టు సరికొత్త రికార్డు సృష్టంచింది. మూడు టీ20 సిరిస్‌లో భాగంగా మౌంట్ మౌన్‌గానిలో జరిగిన రెండో మ్యాచ్‌లో కివీస్ ఆటగాడు కొలిన్ మున్రో 54 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 101 పరుగులతో సెంచరీ సాధించాడు. తద్వారా టీ20 చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన జట్టుగా నిలిచింది.
ఈ సెంచరీతో న్యూజిలాండ్ జట్టు టీ20ల్లో నాలుగు సెంచరీలను నమోదు చేసింది. అంతకుముందు మూడేసి సెంచరీలు మాత్రమే వివిధ జట్లు నమోదు చేశాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, భారత్ జట్లు మూడేసి సెంచరీలు సాధించగా ఇప్పుడు దానిని న్యూజిలాండ్ జట్టు అధిగమించింది.

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ రెండు టీ20 సెంచరీలు చేయగా, గుప్టిల్, మున్రోలు చెరో సెంచరీ చేశారు. కాగా, బే పార్కులో జరిగిన ఈ మ్యాచ్‌లో కొలిన్ మున్రో ఐదో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివర్లో 39 బంతులాడిన బ్రూస్ 59 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
దీంతో మూడు టీ20 సిరిస్‌ను 2-0తో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ సిరీస్‌ను కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 18.1 ఓవర్లలో148 పరుగులకే ఆలౌటైంది.