హైదరాబాద్: రెండోసారి కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి కోహ్లీ సేన సన్నద్ధత తీరుతెన్నులను మార్చేశాడు. తనదైన శైలిలో జట్టుకు కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అతడి స్టయిల్ మైదానంలో మంచి ఫలితాలు చూపుతుండడం విశేషం. రవిశాస్త్రి కోచింగ్ స్టయిల్ ఎలా ఉంటుందంటే..
ఓపెనర్లు జట్టుకంటే ముందే గ్రౌండ్‌కు చేరుకొని ప్రాక్టీస్ చేస్తారు. ఇందులో భాగంగానే గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో ధావన్, అభినవ్ ముకుంద్ అందరికంటే ముందుగా స్టేడియానికి వచ్చి ప్రాక్టీస్ చేశారు. జట్టు కనుక తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఓపెనర్లు అప్పటికే నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలన్నది శాస్త్రి ఉద్దేశం.
ఇందులో భాగంగానే తొలుత ఓపెనర్లు నెట్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. గాలే టెస్టులో కోహ్లీ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంతో అప్పటికే ప్రాక్టీస్ చేసిన ధావన్.. మొదటి ఇన్నింగ్స్‌లో చెలరేగి ఆడి 168 బంతుల్లోనే 190 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

ఇక టీమిండియా టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకుని పదిలం చేసుకోవడంతో పాటు మైదానంలో కూడా అద్భుతమైన ఆటతీరుని కబరచడమే రవిశాస్త్రి కొత్త లక్ష్యం. అంతకముందు కుంబ్లే కోచ్‌గా వెస్టిండిస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై విజయాలు సాధించిన భారత్ టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంక్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే జట్టు ఆలోచనా విధానాన్నీ రవిశాస్ర్తి మార్చి వేశాడు. ఇంత తక్కువ వ్యవధిలో కుంబ్లే, శాస్ర్తిల కోచింగ్ విధానాలను పోల్చి చూడలేం కానీ.. అతడి మొదటి సమావేశమే జట్టులోని ఆటగాళ్లపై బాగా ప్రభావం చూపిందనడంలో ఎలాంటి సందేహం లేదు.