
న్యూఢిల్లీ: పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టెస్ట్ ర్యాంకింగ్ దారుణంగా పడిపోయింది. నవంబరు 2019 నుంచి కోహ్లీ సెంచరీ చేయలేదు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసి టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయాడు. కోహ్లీ స్థానం ఈ స్థాయిలో దిగజారడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి. ఎపుడూ టాప్-3లో ఉండే కోహ్లీ ఇలా టాప్-5కి పడిపోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ స్థానం దిగజారిన విషయం తెలిసిన అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ షాక్‌కు గురయ్యారు. కోహ్లీ త్వరలోనే సెంచరీ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు జరగ్గా.. విరాట్ కోహ్లీ 0, 42, 20 పరుగులు చేశాడు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ బ్యాటింగ్ చేయలేదు. అయితే కోహ్లీ తాజా ఫామ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజ్‌కుమార్ శర్మ అన్నారు. 'నేను కోహ్లీ ఫామ్ గురించి ఎలాంటి ఆందోళన చెందడం లేదు. అతడిని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. గత మ్యాచ్ తర్వాత నేను కోహ్లీతో మాట్లాడా. కొంత ఉద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. అతడి పరుగుల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. త్వరలోనే అతడి నుంచి పెద్ద సెంచరీ రాబోతోంది' అని రాజ్‌కుమార్ చెప్ప్పాడు.
విరాట్ కోహ్లీ గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై చివరిసారిగా శతకం చేశాడు. ఆ తర్వాత కొన్నిసార్లు మాత్రమే 70, అంతకుమించిన పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ.. ఇటీవల ముగిసిన టెస్ట్ ఛాంపియన్‌షిఫ్ ఫైనల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనైనా 71వ శతకం అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానుల ఆశలను విరాట్ వమ్ము చేశాడు. 2008లో క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చిన కోహ్లీ.. 2020లో మాత్రమే మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు. 2021లోనైనా శతకం సాధిస్తాడా లేదో చూడాలి.
ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 25న లీడ్స్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ కోసం భారత జట్టు ఆదివారం లీడ్స్ చేరుకుంది. చేరుకోవడమే ఆలస్యం అప్పుడే ప్రాక్టీస్ మొదలెట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ లోకేష్ రాహుల్. వైస్ కెప్టెన్ అజింక్య రహానేలు హెడింగ్లీ స్టేడియంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌లో చమటోడ్చాడు. పేస్, స్పిన్ బౌలర్లను అతడు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. పేసర్లు మొహ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్.. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు బౌలింగ్ సాధన చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌కు సంబందించిన కసరత్తులు చేయగా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్యాచులు ప్రాక్టీస్ చేశాడు. టీమిండియా సాధనకు సంబందించిన ఫొటోలను బీసీసీఐ తన అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.