కొత్త మలుపు తిరిగిన బౌలింగ్ కోచ్ కథ: రవిశాస్త్రి అండ్ టీమ్ కాంట్రాక్టులు ఆపండి!
హైదరాబాద్: కోచ్ ఎంపిక కథ కంచికి చేరిందనుకునేలోపే భారత క్రికెట్ జట్టులో మరో కొత్త కథ మొదలైంది. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్‌ని తీసుకోవాలని అనుకుంటున్నట్లు రవిశాస్త్రి మీడియాతో చెప్పడంతో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. దీంతో భారత క్రికెట్ జట్టులో కోచ్ ఎంపిక డ్రామాకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు.
టీమిండియా ప్రధాన కోచ్‌ను ఎంపిక చేసి తప్పుకోవాల్సిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను, బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా రాహుల్ ద్రవిడ్‌ని నియమించడంతో ఈ వివాదం మొదలైంది. జట్టు సహాయక సిబ్బంది ఎంపిక తన ఇష్టమని, ఆ విషయంలో తానే నిర్ణయం తీసుకుంటానని రవిశాస్త్రి చెప్పడంతో కోచ్ కథ కొత్త మలుపు తిరిగింది.
జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేయడంపై సీఓఏ హర్షం వ్యక్తం చేసినా.. బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్‌లను తీసుకోవడంపై కమిటీ కూడా అంత సుముఖంగా లేదు. ఈ ఎంపికతో సీఏసీ తమ పరిధిని దాటి వ్యవహరించిందని పరిపాలక కమిటీ భావిస్తోంది. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన బీసీసీఐ పరిపాలనా కమిటీ (సీఓఏ) నేరుగా రంగంలోకి దిగింది.

కాంట్రాక్టు ప్రక్రియను ఆపివేయండి
రవిశాస్త్రితో పాటు జహీర్, ద్రవిడ్‌లకు ఇచ్చే కాంట్రాక్టులు ప్రక్రియను ఆపేయాలని బోర్డును ఆదేశించింది. ముందు ఈ వివాదానికి సంబంధించిన వివరాలను తమకు పంపాలంటూ బీసీసీఐని ఆదేశించింది. మరోవైపు రవిశాస్త్రి తీరుపై సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన సీఏసీ తీవ్రంగా మండిపడిందని, దీంతో సీఓఏ రంగంలోకి దిగక తప్పలేదని బోర్డులోని అధికారి ఒకరు వెల్లడించారు.

శాస్త్రితో మాట్లాడిన తర్వాతే ఆ ఇద్దరినీ ఎంపిక చేశాం
రవిశాస్త్రితో మాట్లాడిన తర్వాతే ఆ ఇద్దరినీ తాము ఎంపికచేశామని, ఇప్పుడిలా మాట్లాడటం ఏంటని సీఏసీ సైతం మండిపడుతోంది. దీంతో సహాయక కోచ్‌లకు ఇచ్చే జీతాల్లోనూ ఎక్కువ వ్యత్యాసం ఉండకూడదని కూడా సీఓఏ భావిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ లీగల్ టీమ్ వీరికి సంబంధించిన కాంట్రాక్టులను తయారు చేస్తోంది.

ఆ తర్వాతే తుది నిర్ణయం
అయితే సీఓఏ మాత్రం ప్రక్రియను వెంటనే నిలిపేయాలని ఆదేశించింది. వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బౌలింగ్ కోచ్ వివాదంపై రవిశాస్త్రి కూడా సోమవారం సీఓఏతో కలిసి చర్చించనున్నాడు. మరోవైపు బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు జహీర్‌ఖాన్ రూ.4 కోట్లు కావాలని అడిగాడని, సీఓఏ మాత్రం అంత ఇవ్వడానికి రెడీగా లేదని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

జహీర్ ఖాన్ బౌలింగ్ కన్సల్టెంట్ మాత్రమే
మరోవైపు జహీర్ ఖాన్‌ను టీమిండియా బౌలింగ్ కన్సల్టెంట్‌గా తీసుకున్నామని అతడిని బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేయలేదని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 'భారత క్రికెట్ అభివృద్ధిపై రవిశాస్త్రి ఆలోచనలు, ప్రణాళికలను మెచ్చి కోచ్‌గా రవిని ఎంపిక చేశారు. ఆ తర్వాత అతడిని సంప్రదించి.. విదేశీ పర్యటనల కోసం సలహాదారులుగా ద్రవిడ్, జహీర్ ఎంపిక జరిగింది' అని బీసీసీఐ తెలిపింది.

బౌలింగ్ కోచ్ విషయంలో గందరగోళం
అలాగే ఏడాదిలో ఎక్కువ రోజులు జట్టుతో పాటు ఉండటం తన వాళ్ల కాదని, కావాలంటే ఓ 100 రోజులు కేటాయిస్తానని ఆఫర్ ఇచ్చి జహీర్ ఖాన్ పక్కకు తప్పుకున్నాడు. మరి ఇప్పుడు బౌలింగ్ కోచ్ అని సీఏసీ, కాదు సలహాదారేనని బీసీసీఐ అంటున్న నేపథ్యంలో జహీర్ ఖాన్ బాధ్యతలు స్వీకరిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. బౌలింగ్ కోచ్ విషయంలో ఇంత గందరగోళం జరుగుతున్నా జహీర్ ఖాన్ మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications