హైదరాబాద్: టీమిండియా తదుపరి కోచ్ ఎవరో మంగళవారం సాయంత్రం లోపు ప్రకటించాలని సీఏసీని బీసీసీఐ పరిపాలనా కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ ఆదేశించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కొత్త కోచ్ కోసం సోమవారం సీఏసీ ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్వ్యూ అనంతరం కొత్త కోచ్ ప్రకటన ఉంటుందని అందరూ భావించినప్పటికీ కోచ్ ఎంపికకు తొందరేమీ లేదని సీఏసీ సభ్యుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు.
అంతేకాదు కోచ్‌లు ఎలా పని చేస్తారన్నది కోహ్లీ అర్థం చేసుకోవాలి కాబట్టి వెస్టిండీస్ నుంచి తిరిగొచ్చాక అతడితో మేం ఈ విషయమై మాట్లాడి కొత్త కోచ్‌ని ప్రకటిస్తామని చెప్పడంతో బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్‌రాయ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మంగళవారం సాయంత్రం లోగా కొత్త కోచ్ పేరుని ప్రకటించాలని బీసీసీఐని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త కోచ్ ఎంపిక విషయమై వినోద్ రాయ్ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ, బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరీలతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
కొత్త కోచ్ ప్రకటనను వాయిదా వేయొద్దని, మంగళవారం సాయంత్రంలోగా ప్రకటించాలని రాయ్ ఆదేశించారని తెలుస్తోంది. కాగా, గంగూలీ, లక్ష్మణ్, సచిన్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ సోమవారం బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో రవిశాస్త్రి, సెహ్వాగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్, రిచర్డ్ పైబస్‌లకు ఇంటర్వ్యూలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇంటర్వ్యూలు పూర్తి చేసినప్పటికీ కొత్త కోచ్ ఎవరనే విషయాన్ని మాత్రం ప్రకటించని సంగతి తెలిసిందే. 'కోచ్ పేరును ఇప్పుడే ప్రకటించడం లేదు. కొన్ని రోజుల సమయం ఇంకా అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం. ఎంపికకు తొందరేమీ లేదని మా అభిప్రాయం. ఈసారి ఎవరి పేరును ప్రకటించినా వారు 2019 వరల్డ్ కప్ వరకు కొనసాగుతారు' అని గంగూలీ స్పష్టం చేశారు.