
హైదరాబాద్: బీసీసీఐను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలనే యోచనలో ఉంది సీఓఏ (కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్). గతవారం సుప్రీం కోర్టుకు సమర్పించి న మధ్యంతర నివేదికలో ఆఫీసు బేరర్లను తొలగించాలని కోరింది.. ఇప్పుడు వారు ఎటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రధాన ఆఫీసు బేరర్ల అధికారాలను కత్తిరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరి, వినోద్ రాయ్ అధికారాలకు అడ్డుకట్ట పడినట్లే.
ఇటీవలే భారత ఆటగాళ్లకు జీతాలు పెంచుతూ బీసీసీఐ కొత్త కాంట్రాక్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కాంట్రాక్టుల విషయంలో సీఓఏనే అన్నీ తానై వ్యవహరించింది. దీనిపై కోశాధికారి అనిరుధ్ చౌదరి అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంబంధిత దస్త్రంపై సంతకం చేయలేదని సమాచారం. అలాగే కొత్తగా రూ.1.65 కోట్ల వార్షిక జీతంతో మార్కెటింగ్ జనరల్ మేనేజర్‌ను సీఓఏ నిర్ణయించడంపై అమితాబ్ ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలిసింది.
దేశంలో క్రికెట్‌ను కొత్తగా మార్కెట్ చేయాల్సిన అవసరముందా అని అతను ప్రశ్నించడం సీఓఏకు ఆగ్రహం తెప్పించిందట. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ఆఫీస్ బేరర్ల అధికారాలకు కోత వేసినట్లు తెలుస్తోంది. తమ అనుమతి లేకుండా ఆఫీస్ బేరర్లు ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసిన సీఓఏ.. ప్రయాణ, వసతి ఖర్చుల విషయంలోనూ షరతు పెట్టింది.
కార్యదర్శి అమితాబ్ నెలలో 25 రోజుల పాటు ప్రయాణాలు చేస్తూ.. విమానయాన, వసతి ఖర్చుల కింద బీసీసీఐ నుంచి భారీగా బిల్లులు తీసుకుంటున్నట్లు సీఓఏ గుర్తించింది. జాగ్రత్త తీసుకునే నేపథ్యంలో తమ అనుమతి లేకుండా ఏ పర్యటనకూ వెళ్లకూడదని ఆఫీస్ బేరర్లు ముగ్గురికీ స్పష్టం చేసింది.
బోర్డు పాలనకు సంబంధించి ఏ నిర్ణయమైనా తమ ఆమోదం పొందిన ఐదు రోజుల్లో సంబంధిత దస్త్రంపై తాత్కాలిక కార్యదర్శి సంతకం చేయాల్సి ఉంటుందని, లేదంటే అతడి బదులు బోర్డు సీఓఏ సంతకంతో దానికి ఆమోదం లభిస్తుందని కూడా సీఓఏ ఆదేశాలు జారీ చేసింది.
ఆఫీసు బేరర్లకు సీవోఏ తాజా సూచనలు:
* సీవోఏ సూచనల మేరకు ఆఫీసు బేరర్లు, సీఈవో నడుచుకోవాలి. పరిపాలనలో తమకు సహకరించాలి.
* ఆఫీసు బేరర్లకు, ఉద్యోగులు/సహాయకులు/కన్సల్టెంట్ల మధ్య జరిగే సంప్రదింపుల గురించి సీఈవో, సీవోఏకు తప్పని సరిగా సమాచారం ఉండాలి. సీవోఏకు సమాచారం లేదని భావిస్తే.. పైన పేర్కొన్న వారెవరైనా ఆ కాపీని తమ దృష్టికి తీసుకురావచ్చు.
* సీవోఏ అనుమతి లేకుండా ఆఫీసు బేరర్లు లేదా వారి అసిస్టెంట్లు ఎటువంటి పర్యటన, వసతికి సంబంధించిన ఖర్చులు చేయకూడదు. అనుమతి కోరే ముందు ప్రయాణం, ఖర్చులకు సంబంధించి వివరణాత్మక నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. (అమితాబ్ చౌదరి నెలలో 25 రోజుల పాటు బోర్డు ఖర్చులతో ప్రయాణాలు చేస్తున్నాడని, విలాసవంతమైన హోటళ్లలో బస చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణ యం తీసుకున్నారు.)
* కేసుల విషయంలో ఆఫీసు బేరర్ల న్యాయసలహా ఖర్చులను బోర్డు భరించదు.
* బోర్డు కేసులకు సంబంధించిన అఫిడవిట్లు, దరఖాస్తులు, ఇతరత్రా విషయాల్లో సంతకాలు చేసే అధికారం సీవోఏకు మాత్రమే ఉంది.
* రూ.25 లక్షలకు పైబడిన కాంట్రాక్ట్‌లు/టెండర్లకు సంబంధించిన వాటి అనుమతి కోసం సీఈవో, సీవోఏ ముందు పెట్టాలి. బోర్డు తరఫున కార్యదర్శి వా టిపై సంతకాలు చేసే అధికారం ఉంది. కాగా, సీవోఏ ఆమోదం పొందిన కాంట్రాక్ట్‌పై కార్యదర్శి.. 5 రోజుల్లో పు సంతకాలు చేయకపోతే వాటిపై సీఈవో సంతకం చేసే విధంగా సీవోఏ సూచిస్తుంది.
* ఇక బోర్డు తరఫున చేసే చెల్లింపులన్నీ కార్యదర్శి, సీఈవోలు కలసి ఆమోదించాలి. ఇద్దరిలో ఎవరు విభేదించినా.. 3 రోజుల తర్వాత అది సీవోఏ ఆమోదం కో సం వస్తుంది. అయితే, సాధారణ చెల్లింపులకు మా త్రం సీవోఏ అనుమతి అవసరం లేదు.
* బోర్డు రాజ్యాంగం ప్రకారం ఆఫీసు బేరర్లు ఏవై నా అధికారాలు ఉపయోగించుకోవాలన్నా.. అందుకు సీవోఏ అనుమతి ఉండాల్సిందే.
* సర్వసభ్య సమావేశాలు, సబ్ కమిటీల ఏర్పాటు, ఏవైనా మీటింగులకు సంబంధించి బోర్డు నోటీసులు విడుదల చేసే ముందు సీవోఏ అనుమతి తీసుకోవాలి. ఆయా సమావేశాల అజెండా, తీసుకున్న నిర్ణయాలను సీవోఏకు నివేదించాలి. సీవోఏ అనుమతి లేకుండా ఎటువంటి నిర్ణయాలను అమలు చేయకూడదు.