Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఇతర ఉన్నతాధికారులు కూడా ఆయన వెంట ఉన్నారు.
వరల్డ్ బ్యాంక్ సీఈఓతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ట్రైజిన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ సెంటర్, అసెట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్‌డ్ డేటా ఆపరేషన్స్‌లో ప్రముఖ కంపెనీ ఆర్సీసీయం వంటి సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో సమావేశం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ పిలుపునిచ్చారు.

అదే సమయంలో భారత అంధ క్రికెట్ జట్టు కూడా అమెరికాలో పర్యటిస్తోంది. అంధుల క్రికెట్‌పై అమెరికన్లల్లో అవగాహన, చైతన్యాన్ని కల్పించడం, ఈ గేమ్‌ను మరింత ప్రోత్సహించేలా ఈ టూర్ చేపట్టింది. సెప్టెంబర్ 17వ తేదీ వరకు అంధ క్రికెట్ ప్లేయర్లు మొత్తం 10 నగరాల్లో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా న్యూయార్క్‌లో అంధ క్రికెట్ జట్టు ప్లేయర్లను కలిశారు రేవంత్ రెడ్డి. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. గ్రూప్ ఫొటోలను దిగారు. జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోన్నప్పటికీ తమ కలలను నెరవేర్చుకోవడానికి క్రీడా రంగాన్ని ఎంచుకోవడం పట్ల వారిని అభినందించారు. కేరీర్‌లో అత్యుత్తమ స్థానాలను అందుకోవాలని ఆకాంక్షించారు.
అంధ క్రికెటర్లు ఈ స్థాయికి రావడం స్ఫూర్తిదాయకమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వారి సంకల్ప శక్తికి ఇది నిదర్శనమని చెప్పారు. చూపు లేనప్పటికీ.. ఎన్నో ప్రతికూలా పరిస్థితులు, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందని, తమ కలలను సాకారం చేసుకోవడంలో ఏ శక్తి కూడా అడ్డుపడదనే విషయాన్ని అంధ క్రికెటర్లు నిరూపించారని ప్రశంసించారు.