
ఎక్కువ ధర ఎవరికంటే
15 సీజన్ల ఐపీఎల్ వేలం చరిత్రలో మొత్తంగా అత్యధిక ధర పలికిన ఆటగాడిగా సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ నిలిచాడు. 2021 సీజన్లో క్రిస్ మోరీస్‌ను రాజస్థాన్ రాయల్స్ రికార్డు స్థాయిలో 16 కోట్ల 25 లక్షల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత రెండో స్థానంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. అతడిని 2015లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 16 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ మూడో స్థానంలో ఉన్నాడు. అతని కోసం 2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 15 కోట్ల 50 లక్షల రూపాయలు వెచ్చించింది.

నాల్గో స్థానంలో కిషన్
ఈ ఏడాది అత్యధిక ధర పలికిన టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉన్నాడు. 15 కోట్ల 25 లక్షల రూపాయలతో ఇటీవల జరిగిన మెగా వేలంలో కిషన్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో ఐదో స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఉన్నాడు. 2011లో గంభీర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ 14 కోట్ల 90 లక్షల రూపాయల భారీ ధరతో కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆరో స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఉన్నాడు. అతడిని 2017లో రైజింగ్ పుణే 14 కోట్ల 50 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఏడో స్థానంలో యువ రాజ్‌సింగ్ ఉన్నాడు. 2014లో యువరాజ్ రూ.14 కోట్లకు రాయల్ చాలెంజర్స్ కొనుగోలు చేసింది.
ఈ ఏడాది దీపక్ చాహర్‌ను కూడా చెన్నైసూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు దక్కించుకుంది.

ఏ సీజన్లో ఎవరికి ఎక్కువ
ఇక మిగతా వారంతా ఇంతకు తక్కువ ధరకే అమ్ముడుపోయారు. అయితే పైన చెప్పుకున్న వారందరిదీ ఆ సీజన్లో వారిదే అత్యధిక ధరగా నిలిచింది. ఇక 2018లో బెన్‌స్టోక్‌స్ అత్యధిక ధర పలికాడు. అతడిని రూ.12.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. 2016లో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అత్యధిక ధర పలికాడు. ఆర్సీబీ అతడిని 9.5 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. 2009లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ నిలిచారు. వీరిద్దరిని ఆర్సీబీ, సీఎస్కే 9.8 కోట్ల రూపాయల చొప్పున వెచ్చించి కొనుగోలు చేశాయి.

మొదటి సీజన్లో ధోని
ఐపీఎల్ మొదటి సీజన్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నిలిచాడు. ధోనిని 2008లో సీఎస్కే రూ.9.5 కోట్లకు కొనుగోలు చేసింది. 2010లో ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లుగా షేన్ బాండ్, కీరన్ పొలార్డ్ నిలిచారు. వీరిని కోల్‌కతా, ముంబై రూ.4.8 కోట్ల రూపాయల చొప్పును వెచ్చించి కొనుగోలు చేశాయి. ఇక 2012లో రవీంద్ర జడేజా కోసం చెన్నై రూ.12.8 కోట్లు చెల్లించింది. 2013లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా గ్లెయిన్ మాక్స్‌వెల్ నిలిచాడు. అతని కోసం ముంబై ఇండియన్స్ రూ.6.3 కోట్లు చెల్లించింది.


Click it and Unblock the Notifications












