
మెల్‌బోర్న్: విశ్వవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహించకపోవడమే మంచిదని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ క్రిస్ లిన్ అభిప్రాయపడ్డాడు. వైరస్ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే జట్లకు వసతి, ఆతిథ్యం, ప్రయాణ సదుపాయాలు కల్పించడం కష్టమన్నాడు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే.
క్రిస్ లిన్ మాట్లాడుతూ... 'మేమంతా టీ20 ప్రపంచకప్ జరగాలనే అనుకుంటున్నాం. అందులో పాల్గొనాలనే భావిస్తున్నాం. కానీ ఇప్పుడు కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మన ముందు అతిపెద్ద సవాల్ నిలిచింది. టోర్నీకి ముందే జట్లను రప్పించి క్వారంటైన్‌లో ఉంచి టోర్నీ నిర్వహించడం అంత సులువు కాదు. హోటళ్లలో బస, ప్రయాణ సదుపాయాలు కల్పించడం సాధారణ విషయమేమీ కాదు' అని పేర్కొన్నాడు.
ఐసీసీ గత వారం నిర్వహించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో టీ20 ప్రపంచకప్‌పై ఎలాంటి చర్చ జరపలేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అక్టోబరు-నవంబరుల్లో ప్రపంచకప్ నిర్వహణ సాధ్యమయ్యేలా లేదని బీసీసీఐ అధికారి ఒకరు భావిస్తున్నాడు. 'ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పొట్టి ప్రపంచకప్ జరగడం ఆచరణ సాధ్యం కాదనిపిస్తోంది. భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడడమన్న ఆలోచనే అవివేకం. టోర్నీలో పాల్గొనడానికి జట్లకు ఆయా దేశాలు అనుమతి మంజూరు చేస్తాయో కూడా తెలియదు' అని ఆయన అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే టీ20 ప్రపంచకప్ ఖచ్చితంగా వాయిదా పడుతుందని తెలుస్తుందని ఫించ్ పేర్కొన్నాడు. అయితే అది ఎన్ని రోజులు వాయిదా పడుతుందో.. కచ్చితంగా చెప్పలేమన్నాడు. అయితే ఆట ఒకసారి ప్రారంభమైతే స్టేడియంలో ప్రేక్షకులు ఉన్నారా లేదా అనే విషయానికి ప్రాధాన్యత ఉండదని ఫిచ్ తెలిపాడు. 'ఒకసారి ఆటపై దృష్టి పెట్టి.. ఆడటం ప్రారంభించాక.. ఖాళీగా ఉండే స్టేడియం ప్రభావం ఆటగాళ్లపై ఉండదు. మేం న్యూజిలాండ్‌తో ఒక వన్డే ఆడాం. మొదటి నాలుగు ఓవర్లు కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ, ఆ తర్వాత అలవాటు అయిపోయింది.'అని ఫించ్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ భారత్‌లో కరోనా అదుపులోకి వస్తే ఐపీఎల్ 2020, టీ20 ప్రపంచకప్ ఇక్కడే నిర్వహించే విధంగా.. 2021లో జరిగే నిర్వహణను ఆస్ట్రేలియాకు ఇచ్చేలా పరస్పరం మార్పిడి చేసుకోవాలని సూచించాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను బీసీసీఐ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అలానే ఐపీఎల్‌ను సెప్టెంబరులో నిర్వహించాలన్నాడు.