
జిమ్‌లో వర్కౌట్స్
ఐపీఎల్-13లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున 'యూనివర్సల్ బాస్' క్రిస్ గేల్ బరిలోకి దిగనున్నాడు. అయితే కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడింది. దీంతో భారత్ వచ్చిన గేల్.. తిరిగి జమైకాకు వెళ్ళిపోయాడు. '#StayAtHomeChallenge'లో భాగంగా ఈ విధ్వంసక ఓపెనర్ ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే సూపర్ హీరో సూట్ ధరించి ఇంట్లోని జిమ్‌లో వర్కౌట్స్ చేసాడు. వెనకాల సాంగ్ ప్లే అవవుతుండగా.. బరువులు ఎత్తడం, పుష్-అప్‌లు చేయడం వంటివి చేసాడు. దీనికి సంబందించిన వీడియోను గురువారం గేల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నిర్బధంలో ధావన్ కూడా:
ఇటీవలే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ జర్మనీకి వెళ్ళాడు. జర్మనీ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఢిల్లీకి చేరిన ధావన్ నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో చేరాడు. అలాగే అక్కడి పరిస్థితిని వివరిస్తూ మంగళవారం ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'ఢిల్లీకి 70 కి.మీ దూరంలోని ఓ భవనంలో అందరం 24 గంటల పర్యవేక్షణలో ఉన్నాం. మా అందరికి పరిశుభ్రమైన ఒక్కో గది కేటాయించారు. అలాగే ప్యాకేజ్‌డ్ వాటర్‌తో పాటు రుచికరమైన భోజనం, స్లిప్పర్స్ కూడా ఇచ్చారు. వైరస్ నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి' అని ధావన్ చెప్పుకొచ్చాడు.

45 ఏళ్ల వరకు కొనసాగుతా:
ఇటీవల స్పోర్ట్స్ ఛానెల్‌తో ముఖాముఖిలో గేల్ మాట్లాడుతూ... 'ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్ మ్యాచ్‌లు ఆడుతున్నా. ఎందుకంటే ఆటకు నేను చేయాల్సింది చాలా ఉందని నా నమ్మకం. అందుకు నా శరీరం కూడా సహకరిస్తుంది. ఇందుకు చాలా సంతోషంగా ఉన్నా. రోజులు గడిచేకొద్ది నేను యవ్వనంగా మారుతున్నా. నేను ఆడితే చూడాలని చాలా మంది అభిమానులు ఆశిస్తున్నారు. నాక్కూడా క్రికెట్‌పై ఇంకా ఇష్టం పోలేదు. 45 అనేది మంచి సంఖ్య. 45 ఏళ్ల వరకు కొనసాగితే బాగుంటుంది. నాకు ఆటపట్ల ప్రేమ, అభిరుచి, అంకితభావం ఉన్నాయి. వీలైనంత కాలం కొనసాగడానికి ప్రయత్నిస్తా' అని అన్నాడు.
టీ20 ప్రపంచకప్ ఆడుతా
ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని తన మనసులో మాట గేల్ ఇటీవలే బయటపెట్టాడు. 'టీ20 ప్రపంచకప్‌లో ఆడితే బాగుంటుంది. అందుకు నాకు తలుపులు తెరిచి ఉన్నాయి. అయితే ఏం జరుగుతుందో వేచి చూడాలి. నా కన్నా కొంత మంది ప్రతిభగల యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఈ విషయాన్ని సెలెక్టర్లకే వదిలేస్తున్నా' అని గేల్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












