సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ పోటీల్లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ ఆడేందుకు తమకు అభ్యంతరం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు ఆడుతున్న క్రిస్ గేల్.. గత సీజనులో ఓ టెలివిజన్ యాంకర్‌తో అసభ్యకరంగా మాట్లాడిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో క్రిస్ గేల్ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో పాటు అతనిని తొలగించాలన్న డిమాండ్ వినిపించింది. ఇలాంటి సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సుదర్ లాండ్ తాజాగా స్పందించాడు. మ్యాచ్ ఫిక్సింగ్, డోపింగ్ వంటి వాటికి పాల్పడితే మాత్రమే తాము జోక్యం చేసుకుంటామని, ఆటగాళ్లను తప్పించడంలో తమ పాత్ర ఉండబోదని స్పష్టం చేశాడు. ఎవరిని ఆడించాలన్న విషయంలో ఫ్రాంచైజీలదే తుది నిర్ణయమన్నాడు.

గతంలో బిగ్ బాష్ లీగ్ సందర్భంగా సిడ్నీ క్రికెట్ మైదానంలో ఓ మహిళా ప్రజెంటర్‌తో గేల్ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది.
ఆ టీవీ ప్రజెంటర్‌ను 'డోన్ట్ బ్లష్ బేబీ' (సిగ్గుపడకు బేబీ) అన్నాడు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించినందుకు గేల్‌కు జరిమానా విధించారు. గేల్ కూడా.. తాను సరదాకే ఆ వ్యాఖ్యలు చేశానని, ఒకవేళ ఆమె బాధపడితే నా క్షమాపణలు అని చెప్పాడు. అంతేకాదు, ఇటీవల తన కూతురుకు బ్లష్ అని నామకరణం చేశాడు.