మెల్బోర్న్: అసభ్య వ్యాఖ్యలు, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ప్రముఖ ఆస్ట్రేలియా మీడియా సంస్థ పైన పరువు నష్టం దావా వేయాలని భావిస్తున్నారు. గత ప్రపంచ కప్ సందర్భంగా సిడ్నీలో ఆస్టేలియా మహిళతో గేల్ అసభ్యకరంగా వ్యవహరించాడని వార్తలు వచ్చాయి.
దీనిపై ఆ వార్తను మొదట బయటకు చెప్పిన మీడియా సంస్థ పైన దావా వేయనున్నాడని తెలుస్తోంది. గేల్ ఇందుకోసం ఓ ప్రముఖ ఆస్ట్రేలియన్ లాయర్ సేవలు కోరాడు. ఇటీవల క్రిస్ గేల్ పైన వరుసగా వేధింపుల విమర్శలు వెల్లువెత్తుతోన్న విషయం తెలిసిందే.

బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనగేడ్స్ జట్టు తరఫున ఆడుతున్న గేల్ ట్వంటీ20 మ్యాచ్ గెలిచిన అనంతరం మహిళా ప్రజెంటర్‌తో అసభ్యంగా మాట్లాడాడు. తనతో వస్తావా అని అడిగాడు. అది తీవ్ర దుమారం రేపింది. దీంతో అతని పైన జరిమానా కూడా విధించారు.
గేల్ మీడియా మేనేజర్ మాట్లాడుతూ... గేల్ పైన అసత్య ప్రచారాలు, అభూత కల్పనలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే పరువు నష్టం దావా వేసేందుకు ప్రముఖ లాయర్‌ను నియమించుకున్నట్లు తెలిపారు.