మెల్బోర్న్: ఇటీవల వివాదంలో చిక్కుకున్న వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ మరోసారి బ్యాట్‌తో బౌలర్లను బెంబేలెత్తించాడు. కేవలం 12 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి ప్రపంచ రికార్డును సమయం చేశాడు.
ఆస్ట్రేలియాలోని డక్లాండ్ స్టేడియంలో సోమవారం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్(బిబిఎల్) ట్వంటీ20 టోర్నమెంటులో క్రిస్ గేల్ 12 బంతుల్లో 50పరుగులు చేసి భారత ఆటగాడు యువరాజ్ సింగ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఇది టీ20 చరిత్రలోనే వేగవంతమైన అర్ధ శతకం.

మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున ఆడుతున్న గేల్.. స్పిన్నర్ తార్వీష్ హెడ్(అడిలైడ్ స్టైకర్) బౌలింగ్‌లో ఈ ఘనత సాధించాడు. గేల్ అర్ధ శతకంలో 7 సిక్సర్లు, ఒక బౌండరీలున్నాయి. ప్రస్తుతం 14బంతుల్లో 52 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు గేల్. ఈ మ్యాచులో 171 పరుగులు చేస్తే గేల్ జట్టు గెలుస్తుంది.
2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసిసి ప్రపంచ కప్ టీ20 ఛాంపియన్‌షిప్‌లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అదే సమయంలో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతులకు ఆరు సిక్సులు బాది మరో రికార్డును నెలకొల్పాడు.