
లీడ్స్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడంపై వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ మరోసారి మాట మార్చారు. ఇప్పట్లో తాను రిటైర్ కాబోనని తేల్చి చెప్పారు. ఇంకా చాలా క్రికెట్ ఆడతానని ఆయన వెల్లడించారు. ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ అధికారిక వెబ్‌సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు- క్రిస్ గేల్ ఈ వ్యాఖ్యాలు చేసినట్లు ఆ వెబ్‌సైట్ వెల్లడించింది. వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడతానని క్రిస్ గేల్ ధృవీకరించినట్లు పేర్కొంది.
నిజానికి- ప్రపంచకప్ టోర్నమెంట్ తరువాత క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని క్రిస్ గేల్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రపంచకప్ మెగా ఈవెంట్ తరువాత క్రిస్ గేల్ మెరుపులను చూడలేమని అభిమానులు భావించారు. ఇటీవలే- తొలిసారిగా గేల్ తన రిటైర్‌మెంట్‌పై స్పందించారు. ప్రపంచకప్ తరువాత తాను వెంటనే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పదలచుకోలేదని అన్నారు. ఈ టోర్నమెంట్ తరువాత తన దేశ పర్యటనకు వచ్చే టీమిండియాతో సిరీస్ ముగిసిన తరువాత రిటైర్ అవుతానని వెల్లడించారు.
తాజాగా- ఆయన మరోసారి నాలిక మడతేశారు. ఇప్పట్లో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పట్లేదని స్పష్టం చేశారు. వీలైనంత క్రికెట్ ఆడతానని అన్నారు. రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని పునరాలోచించుకుంటున్నానని చెప్పారు. దీనిపై జట్టు సహచరుల్లో హర్షం వ్యక్తమౌతోందని గేల్ చెప్పారు. రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవడం వల్ల జట్టు బలోపేతమౌతుందని కేప్టెన్ జేసన్ హోల్డర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడని అన్నారు.