బెంగళూరు: ఓ టీవీ యాంకర్‌తో క్రికెట్ మైదానంలో అసభ్యంగా ప్రవర్తించి అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌లో మంచితనం పాల్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మైదానంలో దిగి ప్రత్యర్థుల బౌలర్లను ఊచకోత కోసే గేల్‌లోని మానత్వాన్ని చూపే ఘటన ఒకటి బెంగళూరులో గతంలో చోటు చేసుకుంది. అది కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగానే.
వివరాల్లోకి వెళితే.. 2012, ఏప్రిల్ 17న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో గేల్ బాదిన సిక్సర్ తగిలి గ్యాలరీలోని పదేళ్ల బాలిక గాయపడింది. సాధారణంగా మ్యాచ్ సందడిలో ఈ విషయం సదరు హిట్టర్‌కు తెలిసే అవకాశం తక్కువ. ఒకవేళ తెలిసినా అవునా.. ఇప్పుడు ఎలా ఉందనే ప్రశ్నతో ముగించేస్తుంటారు.
కానీ, ఆ రోజు సిక్సర్ బాదిన గేల్ మానవత్వంతో స్పందించాడు. అప్పటి వరకు మైదానంలో బౌలర్లను భీకరంగా ఊచకోత కోసి (81: 48 బంతుల్లో 4×4, 8×6) ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన గేల్ పాపకు తగిలిన గాయం గురించి తెలియగానే చలించిపోయాడు. జట్టు గెలుపు సంబరాల్లో ఉంటే.. తాను మాత్రం మైదానం నుంచి నేరుగా బాలిక చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లిపోయాడు.
అక్కడ ఆ బాలికకు అందుతున్న చికిత్సను ప్రత్యక్షంగా ఆరాతీసి వాత్సల్యంతో పాపను పలకరించాడు. అప్పటి వరకు మైదానంలో బౌలర్లపై ఉగ్రరూపం దాల్చుతూ వరుస సిక్సర్లతో విరుచుకుపడే ఆరడుగుల గేల్‌ను చూసిన అభిమానులు ఈ సన్నివేశాన్ని చూసి ఫిదా అయిపోయారు.
బౌలర్ నుంచి దూసుకొచ్చే బంతిని బాదేటప్పుడు తప్ప మరెక్కడా కఠినంగా వ్యవహరించని క్రిస్‌గేల్ మైదానంలో తన హిట్టింగ్, హెయిర్ స్టైల్, హావభావాలు, డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
అయితే ఇటీవల ఓ టీవీ వ్యాఖ్యాతతో మాట్లాడిన అంశాలు వివాదాస్పదమై గేల్ కెరీర్‌ను ప్రమాదంలో నెట్టేస్తుండటం వారిని బాధకలిగించే విషయమే. సరదా మితిమీరితే ఇలాంటి పరిణామాలే ఎదుర్కొవాల్సి వస్తుందనడానికి గేల్ ప్రవర్తనే నిదర్శనంగా నిలుస్తోంది.

విండీస్ కాంట్రాక్ట్ జాబితాలో గేల్, సమీ, రస్సెల్స్‌కు దక్కని చోటు
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1,2015 నుంచి సెప్టెంబర్ 30, 2016 కాలానికి గాను డబ్యూఐసీబీ తాజాగా ప్రకటించిన కాంట్రాక్టు జాబితా నుంచి టీ20 కెప్టెన్ డారెన్‌సమీ, విధ్వంసకర బ్యాట్‌మన్ క్రిస్ గేల్ ఆల్‌రౌండర్లు డ్వేన్‌బ్రావో, రస్సెల్, స్పిన్నర్లు సునీల్ నారాయణ్, బెన్‌లను తొలిగించింది. వీరితో పాటు వెటరన్ క్రికెటర్ చంద్రపాల్ కూడా కాంట్రాక్టుల నుంచి డబ్యూఐసీబీ మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
వీరిలో టీ20 కెప్టెన్ సమీ, రస్సెల్‌లు గత శ్రీలంక పర్యటనలో జట్టుకు ప్రాతినిధ్యం వహించగా, సునీల్ నారాయణ్ ప్రస్తుతం ఐసీసీ నిషేధం ఎదుర్కొంటున్నాడు. రెండేండ్ల క్రితం కాంట్రాక్టు వివాదంలో భారత్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకున్న జట్టులో కీలక సభ్యుడైన డ్వేన్‌బ్రావో, రస్సెల్‌కు డబ్యూఐసీబీ మొండిచేయి చూపించింది.