కాన్బెర్రా: వన్డే ప్రపంచ కప్ పోటీల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పరుగుల సునామీ సష్టించాడు. జింబాబ్వే బౌలర్లను ఆటాడుకున్నాడు. కాన్‌బెర్రా మనుకా ఓవల్ మైదానం ఎప్పటికీ గుర్తుండి పోయే విధంగా అతని పరుగుల వరద పారింది. జింబాబ్వే ఆటగాళ్లు ప్రేక్షకులుగా, ప్రేక్షకులు ఫీల్డర్లుగా మారిన వైనం కనిపించింది. సింగిల్స్ కన్నా ఫోర్లు, సిక్సర్లు సులభమనే విధంగా గేల్ బంతులను దంచికొట్టాడు.
క్రిస్ గేల్ తొలి 50 బంతుల్లో 50 పరుగులు, 105 బంతుల్లో 100 పరుగులు, 126 బంతుల్లో 150 పరుగులు, 138 బంతుల్లో 200 పరుగులు చేశాడు. తొలి ఓవర్ పన్యగర బౌలింగులోనే క్రిస్ గేల్ తన పరుగుల వేట ప్రారంభించాడు. అతను ఓవర్ల వారీగా సాధించిన పరుగులు ఇలా...

తొలి ఓవరు : పన్యగర బౌలింగులో చివరి బంతికి 2 పరుగులు
నాలుగో ఓవర్: చటారా బౌలింగులో తొలి ఫోర్
ఆరో ఓవర్: చటారా బౌలింగులోనే రెండు ఫోర్లు
11వ ఓవర్: విలియమ్స్ బౌలింగులో తొలిసి సిక్స్
15వ ఓవర్: విలియమ్స్ బౌలింగులో ఫోర్
18వ ఓవర్: చిగుంబుర బౌలింగులో సిక్స్, సింగిల్, అర్థ సెంచరీ
20వ ఓవర్: చిగుంబుర బౌలింగులో ఫోర్
26వ ఓవర్: కముంగోజి బౌలింగులో వరుసగా రెండు సిక్స్‌లు
29వ ఓవర్: సికిందర్ రాజా బౌలింగులో సిక్స్
36వ ఓవర్: మసకద్జ బౌలింగులో సింగిల్‌తో తన కెరీర్‌లో 22వ వన్డే సెంచరీ, ఇదే ఓవరులో సిక్స్
38వ ఓవర్: పన్యగర బౌలింగులో ఫోర్, సిక్స్
40వ ఓవర్: పన్యగర బౌలింగులో సిక్స్, ఇదే ఓవరులో గేల్ క్యాచ్ అవుటయ్యాడు. అయితే, అది నోబాల్‌గా తేలింది.
41వ ఓవర్: మసకద్జ బౌలింగులో సిక్స్
42వ ఓవర్: చిగుంబుర బౌలింగులో సిక్స్
43వ ఓవర్: విలియమ్స్ బౌలింగులో 150 పరుగులు పూర్తి
44వ ఓవర్: కముంగొజి బౌలింగులో వరుసగా 6,4,6,4. ఇదే ఓవరులో వన్డేల్లో గేల్ (157) అత్యధిక పరుగుల వ్యక్తిగత స్కోర నమోదు
45వ ఓవర్: విలియమ్స్ బౌలింగులో వరుసుగా మూడు సిక్స్‌లు. ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక పరుగులు (189) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు గ్యారీ కిర్‌స్టన్ (188) పేరు మీద ఈ రికార్డు ఉంది.
46వ ఓవర్: చటారా బౌలింగులో 6,4,4 పరుగులు డబుల్ సెంచరీ నమోదు. ప్రపంచ కప్ పోటీల్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నమోదు.
48వ ఓవర్: శామ్యూల్స్‌తో కలిసి 332 పరుగుల భాగస్వామ్యం. వన్డేల్లో ప్రపంచ రికార్డు
50వ ఓవర్: ఆఖరి బంతికి గేల్ (215) నిష్క్రమణ