హైదరాబాద్: ముంబై టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ ప్రశంసల వర్షం కురిపించాడు. వాంఖడె స్టేడియంలో ఇంగ్లాండ్‌తో ముగిసిన నాలుగో టెస్టులో కోహ్లీ సాధించిన డబుల్ సెంచరీ అతడి అసాధారణ ప్రతిభను తెలియజేస్తుందని అన్నాడు.

హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో గేల్ మాట్లాడాడు. యువ క్రికెటర్లు కోహ్లీ అడుగు జాడల్లో నడుస్తారనడంతో ఎటువంటి సందేహాం లేదని చెప్పాడు. ఇప్పటికే ఎన్నో రికార్డుల్ని సృష్టించిన కోహ్లీ రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప ఇన్నింగ్స్‌లను నమోదు చేస్తాడని గేల్ పేర్కొన్నాడు.
క్రిస్ గేల్ ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నాడు. యూఎస్‌ఎల్-డియాజియో రహదారి భద్రత కార్యక్రమ ప్రచార సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగా మద్యం తాగి వాహనం నడపొద్దని, క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చాడు. 'నా హృదయంలో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నా అభిమానులు నన్నెప్పుడూ అక్కున చేర్చుకొంటారు' అని గేల్ తెలిపాడు.
మరోవైపు ఎవ్వరూ ఎన్ని విధాలా ప్రయత్నించినా తాను సిక్సర్లు కొట్టడాన్ని అడ్డుకోలేరని గేల్ స్పష్టం చేశాడు. చివరకు టూత్ పిక్, ఫోర్క్, చిన్నకత్తి తదితర వాటితో కూడా తనకు సిక్సర్ల కొట్టే సామర్థ్యం ఉందని తెలిపాడు. మెరిల్ బోర్న్ క్రికెట్ కమిటీ(ఎంసీసీ) బ్యాట్ సైజ్‌ను తగ్గించాలని సూచించిన అంశంపై కూడా గేల్ స్పందించాడు.
బ్యాట్ సైజుతో తనకెలాంటి ఇబ్బంది లేదని గేల్ పేర్కొన్నాడు. వారు బ్యాట్ సైజు తగ్గించుకున్నా, తన సిక్సర్ల వర్షం మాత్రం ఆగదని గేల్ వ్యాఖ్యానించాడు. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)కు దూరంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించగా, తన కూతురు బ్లష్ తొలి క్రిస్ట్ మస్ వేడుకల్ని జరుపుకుంటున్న కారణంగా ఆ లీగ్ లో పాల్గొనడం లేదని చెప్పాడు.