ముంబై: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తండ్రిగా ప్రమోషన్ కొట్టేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్‌కు పుత్రోత్సాహం కల్గింది.
ఆయన భార్య నటాషా బెర్రిడ్జ్ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈ స్టార్ ఆటగాడు విండీస్‌కు పయనం అయినట్లు సహచర ఆటగాడు సర్పరాజ్ ఖాన్ స్పష్టం చేశాడు. ఆదివారం బెంగళూరులో మ్యాచ్ ముగిసిన అనంతరం గేల్ సరాసరి ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని ఖతార్ ఎయిర్ వేస్‌లో స్వదేశానికి బయల్దేరి వెళ్లినట్లు పేర్కొన్నాడు.

కాగా, ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్, ఏప్రిల్ 22న రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్లతో జరిగే మ్యాచ్‌లలో క్రిస్ గేల్ ఆడే అవకాశం లేదు. ఆర్సీబీ అధికారి ఒకరు వన్ ఇండియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. తను ప్రయాణిస్తున్న విమానంలో 'ఐయామ్ అన్దీవే, బేబీ' అని కేక్‌పై రాసి, దాన్ని ఫొటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు క్రిస్ గేల్.
ఇది ఇలా ఉండగా, ఐపీఎల్ ద్వారా తాను ఎంతో నేర్చుకుంటున్నట్లు సర్పరాజ్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. పలువురు ఆటగాళ్లతో కలిసి ఆడటం వల్ల అనేక విషయాల్ని నేర్చుకునే అవకాశం లభించిందన్నాడు. ప్రత్యేకంగా షేన్ వాట్సన్ నుంచి అనేక విషయాలను నేర్చుకుంటున్నట్లు సర్పరాజ్ తెలిపాడు.