వెస్టిండీస్‌కు చెందిన డైనమిక్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ రాబోయే సీజన్లో ఆడనున్నాడు. యూనివర్స్ బాస్ ఆఫ్ టీ20 క్రికెట్‌గా పేర్కొనే క్రిస్ గేల్.. టీ20 క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అత్యధిక పరుగులు (10,000+), అత్యధిక సెంచరీలు, ఫాస్టెస్ట్ సెంచరీ, అత్యధిక ఫోర్లు, అత్యధిక సిక్సర్లతో సహా దాదాపు ప్రతి చెప్పుకోదగ్గ రికార్డును క్రిస్ గేల్ కలిగి ఉన్నాడు. ఇకపోతే లెజెంట్స్ లీగ్‌లో తాను ఆడబోతున్నట్లు ప్రకటించిన క్రిస్ గేల్ పేర్కొంటూ..'ఈ ప్రతిష్టాత్మకమైన లీగ్‌లో భాగం కావడం.. దిగ్గజాలతో కలిసి ఆడటం నాకు అపారమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇండియాలోని మ్యాచ్ వేదికల వద్ద కలుద్దాం. ' అని గేల్ ప్రస్తావించాడు.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ సహ వ్యవస్థాపకుడు & CEO రామన్ రహేజా మాట్లాడుతూ.. 'క్రిస్ గేల్ లాంటి ప్లేయర్ లెజెండ్స్ లీగ్ ఆడనుండడంతో ఈ లీగ్ మరింత బిగ్గర్ పాపులారిటీ లీగ్‌లా మారింది. క్రికెట్లోని దిగ్గజాల మధ్య మ్యాచ్‌లను చూడ్డానికి అభిమానులు మైదానంలోకి తరలివచ్చి ఈ ఫైర్పవర్ని ఆస్వాదిస్తారని నేను ఆశిస్తున్నా' అన్నాడు. ఇకపోతే ఇటీవల బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఎల్ఎల్సీ రెండో సీజన్లో ఓ ప్రత్యేక మ్యాచ్ ఆడేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇతర దిగ్గజాలతో కలిసి ప్రత్యేక కాస్ కోసం మ్యాచ్ ఆడడానికి ముందుకొస్తున్న లెజెండరీ సౌరవ్ గంగూలీకి రామన్ రహేజా ధన్యవాదాలు తెలిపాడు. ఒకప్పుటి లెజెండ్ ఎప్పుటికీ లెజెండేనని దాదా ఎప్పుడూ క్రికెట్‌కు అండగా ఉంటాడని పేర్కొన్నాడు. హర్భజన్, మహమ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్ తదితర ప్రముఖ క్రికెటర్లు లెజెండ్స్ లీగ్ ఆడబోతున్నారు.
ఇక గంగూలీ ఓ ప్రత్యేక మ్యాచ్ కోసం ఫిట్ నెస్ సాధించడానికి తాను జిమ్‌లో చెమటొడుస్తున్న చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. 'ఆజాది కా మహత్సోవ్ కోసం లెజెండ్స్ లీగ్‌లో ఒక ఛారిటీ ఫండ్ రైజింగ్ మ్యాచ్ ఆడాలనుకుంటున్నాను. అందుకోసం శిక్షణ తీసుకుంటున్నాను. 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర సంబరాల్లో భాగంగా ఈ ఫండ్ రైజింగ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మహిళా సాధికారతనుద్దేశించి కూడా ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను. ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్ టీ20 మ్యాచ్‌లో టాప్ లెజెండరీ క్రికెటర్లతో తలపడాలి. ఎలాగైన మంచి క్రికెటింగ్ షాట్లు ఆడాలి.' అంటూ దాదా పోస్ట్ చేశాడు.