చెన్నై: చెన్నైలో మంగళవారం వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ సందడి చేశాడు. వేళమ్మాల్ స్కూల్‌లో జరిగిన టీచర్స్ డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గేల్‌కు విశేషమైన గౌరవం లభించింది. వందలాది మంది విద్యార్థులు గేల్‌కు సాదర స్వాగతం పలికారు.
క్రిస్ గేల్‌ను స్కూల్ లోని వేదిక వద్దకు గుర్రపు బగ్గీ మీద తీసుకెళ్లి అతని పట్ల అభిమానాన్ని స్కూలు యాజమాన్యం ప్రదర్శించింది. ఈ సందర్భంగా క్రిస్ గేల్ మాట్లాడుతూ 'టీచర్స్ డే'ను విద్యార్థుల మధ్య నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు. క్రీడల్లో రాణించడంతోపాటు విద్యకి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని విద్యార్ధులకు సూచించాడు.
బాగా చదువుకుంటే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని అన్నాడు. గురువులను గౌరవించడం ద్వారా సంస్కారం పెరుగుతుందని, మంచి సంస్కారం జీవితంలో విలువలను నేర్పుతుందని గేల్ అన్నాడు. భారత్‌లో తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీ అని, టి20 ఫార్మాట్‌లో క్రికెట్ ఆడడం తనకెంతో ఇష్టమని చెప్పాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఆడితే చెన్నై తరపున ఆడేందుకు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా చెప్పాడు. ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చాడు.
ఈ సందర్భంగా గేల్‌ను ఓ విద్యార్థి.. 'అందరూ క్రికెటర్ల ఆటోగ్రాఫ్ కోసం ఎగబడుతుంటారు కదా, నువ్వు ఎవరి ఆటోగ్రాఫ్ తీసుకుంటావని' అడగ్గా.. 'ఇంకెవరు.. దీపికా పడుకొనే ఆటోగ్రాఫే తీసుకుంటా. అయినా ఇప్పుడెవరు ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటున్నారు. అంతా సెల్ఫీలే కదా!' అని పేర్కొన్నాడు.