హైదరాబాద్: తనకు 50 ఏళ్లు వచ్చే వరకు క్రికెట్ ఆడటమే తన ప్రధాన లక్ష్యమని వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ పేర్కొన్నాడు. అంతేకాదు యాభై ఏళ్లు వచ్చే వరకూ క్రికెట్ ఆడి తొలి వ్యక్తిని తానే కావాలంటూ గేల్ వ్యాఖ్యానించాడు. ఫాక్స్ స్పోర్ట్స్‌కు శనివారం ఇచ్చిన ఇంటర్యూలో క్రిస్ గేల్ మాట్లాడాడు.
ఇలా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరితే స్టేడియంలో తన ఆటను ఏదొక రోజు కూతురు చూసే అవకాశం ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమేనని చెప్పిన గేల్ ఫిట్ నెస్ అనేది శరీరానికి సంబంధించినదిగా పేర్కొన్నాడు. 2014 సెప్టెంబర్ నుంచి టెస్టు క్రికెట్‌కు దూరమైన క్రిస్ గేల్ టీ20 ఫార్మాట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడు.

టీ20 క్రికెట్‌లో గేల్ రికార్డు స్థాయిలో 9,777 పరుగులు చేశాడు. ఇక గతేడాది బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)కు సంబంధించి తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని మెల్ బోర్న్ రెన్ గేడ్స్ ప్రాంఛైజీ ఎగవేసిందంటూ గేల్ ధ్వజమెత్తాడు. తాను వెస్టిండిస్‌కు చెందిన క్రికెటర్‌ను కావడం వల్లే ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదని అన్నాడు.
మిగతా క్రికెటర్లకు మొత్తాన్ని చెల్లించిన ప్రాంఛైజీ తన విషయంలో ఎందుకు వివక్ష చూపిస్తుందంటూ గేల్ ప్రశ్నించాడు. కామెంటేటర్లకు సైతం డబ్బులు చెల్లించిన బీబీఎల్, తనకు మాత్రం డబ్బు చెల్లించడంలో వెనుకడుగు వేస్తుందన్నాడు. ఇప్పటికే సంవత్సరం గడిచిపోయిందని, తనకు డబ్బు ఎగవేసిన అపవాదను వారు మూట గట్టుకోరనే ఇంకా ఆశిస్తున్నట్లు గేల్ తన ట్విట్టర్‌లో వరుస ట్వీట్లలో పేర్కొన్నాడు.
వెస్టిండిస్ తరుపున 103 టెస్టులాడిన గేల్ 7214 పరుగులు చేశాడు. టెస్టుల్లో గేల్ యావరేజి 42.18గా ఉంది. అందులో 15 సెంచరీలతో పాటు రెండు ట్రిపుల్ సెంచరీలు ఉండటం విశేషం. గత రెండున్నరేళ్లుగా వెస్టిండిస్ టెస్టు మ్యాచ్‌లకు గేల్ దూరమయ్యాడు.