చైనా ఓపెన్‌లో భారత స్టార్లు తడబడ్డారు. ప్రముఖ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ ఇద్దరూ తొలి రౌండ్‌లోనే ఇంటి దారి పట్టారు. చైనా ఓపెన్ తొలి రౌండ్‌లో మలేసియా ప్లేయ్ ఎంగ్ జె యాంగ్‌ను ప్రణయ్ ఎదుర్కొన్నాడు. అతని చేతిలో 12-21, 21-13, 18-21 తేడాతో ప్రణయ్ ఓటమి చవిచూశాడు. తొలి రౌండ్‌లోనే జె యాంగ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు.
తొలి సెట్‌లో సరైన రిథమ్ అందుకోలేకపోయిన ప్రణయ్.. ఆ తర్వాత తేరుకున్నాడు. రెండో సెట్‌లో సత్తా చాటి, జె యాంగ్‌పై పైచేయి సాధించాడు. చివరి సెట్‌లో ప్రణయ్, జె యాంగ్ ఇద్దరూ నువ్వా? నేనా? అన్నట్లు తలపడ్డారు. కానీ చివరకు 18-21 తేడాతో ఓడిన ప్రణయ్ తొలి రౌండ్ ఓటమితో చైనా ఓపెన్ నుంచి బయటకు వచ్చేశాడు.

ఇక లక్ష్య సేన్ కూడా తొలి రౌండ్‌లోనే ఓడిపోయి ఇంటి దారి పట్టాడు. తొలి రౌండ్‌లోనే ప్రపంచ పదో ర్యాంకర్, డెన్మార్క్ షట్లర్ ఆండర్స్ ఆంటోన్సెన్‌ను లక్ష్యసేన్ ఢీకొట్టాడు. మొదటి సెట్ నుంచే పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫస్ట్ గేమ్‌ను 21-23 తేడాతో ఆంటోన్సెన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక రెండో సెట్‌లో మరింత చెలరేగిన లక్ష్యసేన్.. ఆంటోన్సెన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో 26-16 తేడాతో లక్ష్యసేన్ ఈ సెట్ గెలిచాడు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఆంటోన్సెన్ చెలరేగాడు. లక్ష్యసేన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో 9-21 తేడాతో మూడో సెట్ కోల్పోయిన లక్ష్యసేన్ ఇంటి దారి పట్టాడు.
అలాగే మరో స్టార్ ప్రియాన్షు రజావత్ కూడా ఓడిపోయాడు. అతను 13-21, 24-26 తేడాతో ఇండోనేసియా ప్లేయర్ షేసర్ హిరెన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో చైనా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ పోటీ ముగిసింది. అంతేకాదు, డబుల్స్ విభాగంలో ఎంఆర్ అర్జున్-ధ్రువ్ కపిలతో పాటు మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ కూడా ఓటమి పాలయ్యారు.