హైదరాబాద్: భారత్, న్యూజిలాండ్ మధ్య చివరిదైన మూడో టీ20కి అంతా సిద్దమైంది. మూడు టీ20ల సిరిస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 మంగళవారం తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది.
వన్డే సిరీస్‌ను నెగ్గిన కోహ్లీసేన టీ20 సిరీస్‌నూ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉండగా.. వన్డే సిరీస్‌ను త్రుటిలో చేర్చుకున్న కివీస్ కనీసం టీ20 సిరీస్ అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది. మూడో టీ20 కోసం టీమిండియా తీవ్రంగా కసరత్తులు చేస్తూనే, ఖాళీ సమయాల్లో తిరువనంతపురంలోని అందమైన ప్రదేశాల్లో టీమిండియా సందడి చేస్తోంది.
తాజాగా విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపారు. సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండే హార్దిక్ పాండ్యా డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఆరు సెకన్ల నిడివి ఉన్న జిఫ్ ఫార్మాట్ వీడియోలో ఈ ముగ్గురూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు.
దీనికి ముందు హార్దిక్ పాండ్యా తిరువనంతపురంలో బీచ్‌కి అతి సమీపంలో దిగిన ఓ ఆహ్లాదకరమైన ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. 'అద్భుతమైన తిరువనంతపురంలో మా బ్యాటరీలను ఛార్జ్ చేసుకునే సమయమిది' అని కామెంట్ పోస్టు చేశాడు.
ఇదిలా ఉంటే మూడో టీ20కి ఆతిథ్యమిస్తోన్న గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇది. చివరిసారిగా 29 ఏళ్ల కిందట తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో వెస్టిండిస్ జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత ఈ స్టేడియాన్ని పూర్తిగా గ్రీన్ ఫీల్డి స్టేడియంగా మార్చారు.
భారత్‌లో టీ20లకు ఆతిథ్యమిస్తున్న 19వ వేదికగా గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం నిలిచింది. మరోవైపు మూడో టీ20లో ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మూడో టీ20కి వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ముందుస్తు హెచ్చరికలు అటు క్రికెట్ మ్యాచ్ నిర్వహకుల్ని, ఇటు అభిమానుల్ని కలవరపరుస్తున్నాయి.