Cheteshwar Pujara: మిడిలార్డర్‌లో గోడ కట్టినట్లు ఉండిపోయే బ్యాటర్లలో రాహుల్ ద్రవిడ్ తర్వాత ఛెతేశ్వర్ పుజారా అనే చెప్పాలి. ఈ టెస్టు స్పెషలిస్టు తన కెరీర్‌లో ఎన్నో అపురూపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు విజయాలను అందించాడు. అయితే ఇప్పుడు అతడికి జాతీయ జట్టులో చోటు మాత్రం దక్కడం లేదు. తాజాగా జట్టులో నుంచి పుజారాను తప్పించడానికి జరిగిన ప్రయత్నాలు గురించి.. అతడి భార్య షాకింగ్ కామెంట్స్ చేసింది. 2018-19 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో జరిగిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది. ఈ విషయాన్ని ది డైరీ ఆఫ్ ఏ క్రికెటర్ వైఫ్ పుస్తకంలో ఆమె రాసుకొచ్చింది.
ఇంతకీ అందులో ఏం రాసిందంటే
2018-19 ఆస్ట్రేలియా పర్యటన (బోర్డర్-గావస్కర్ ట్రోఫీ)లో భారత్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు పుజారా. అయితే వాస్తవానికి ఆ సిరీస్ లోని మూడో టెస్టు(మెల్‌బోర్న్ టెస్ట్)కు ముందు పుజారాను జట్టు నుంచి తప్పించాలని చర్చలు జరిగాయట. "ఛెతేశ్వర్ అప్పుడు తనకు దొరికిన మూడు రోజుల బ్రేక్ ను పూర్తిగా విశ్రాంతికే ఉపయోగించాడు. అతడు తనకు తగిలిన గాయానికి చికిత్స చేయించుకుంటూ, గదిలోనే ఎక్కువ సమయం గడిపాడు. అయితే అప్పుడు ఒకసారి రూమ్ లో నుంచి బయటకి వచ్చినప్పుడు, ఎవరో ఫోన్‌లో కాస్త గట్టిగా మాట్లాడుతుంటే ఇలా విన్నాడు. 'పుజార్ ఫిట్‌గా లేడు. అతడిని నెక్ట్స్ మ్యాచులో ఆడించకూడదు' అని అంటుంటే నా భర్త విని బాధపడ్డాడు. కానీ అప్పుడు ఆ విషయాన్ని ఆయన నాతో చెప్పలేదు."
"ఆస్ట్రేలియా టూర్ ముగిశాక ఛెతేశ్వర్ పుట్టిన రోజు నాకు ఈ విషయం తెలిసింది. అప్పుడు నేను సోషల్ మీడియాలో వచ్చిన విషెస్ చదువుతున్నాను. ఓ వ్యక్తి ఎంతో సున్నితంగా, హృదయాన్ని హత్తుకునేలా శుభాకాంక్షలు తెలిపాడు. ఆ మెసేజ్‌ని చదివి, 'ఎంతో అందమైన విషెస్, మంచి మాటలు!' అని ఛెతేశ్వర్‌కు చెప్పాను. కానీ అతడు ఒక్క మాట కూడా సమాధానం ఇవ్వలేదు. దీంతో 'ఏమైంది?' అని అడిగాను. కానీ అతడు నోరు మెదపలేదు. కానీ చివరకు బలవంతంగా చెప్పించాను. 'విషెస్ అద్భుతంగా చెప్పారు అంటూ నువ్వు పొగడ్తలు కురిపిస్తున్న ఈ వ్యక్తే.. నన్ను ఫిట్‌నెస్ కారణంగా జట్టులోంచి తీసేయాలని అనుకున్నాడు'. అని నాతో చెప్పాడు. అది విని నేను ఆశ్చర్యపోయాను. నా భర్త ఆ సిరీస్ లో ఎన్నో బాధలు ఎదుర్కొన్నప్పటికీ, ఆ పర్యనటలో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ అద్భుత ప్రదర్శన చేసి, భారత్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు." అని పుజారా భార్య రాసుకొచ్చింది.
పుజారా అద్భుత ప్రదర్శన..
2018-19 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పుజారా అదిరే ప్రదర్శన చేశాడు. తొలి టెస్ట్ (అడిలైడ్)లో 123, 71 పరుగులు చేశాడు. పెర్త్ టెస్ట్‌లో తక్కువ పరుగులే చేసినా, మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టుల్లో వరుసగా 106, 193 పరుగులతో తిరిగి ఫామ్ అందుకున్నాడు. ఆ సిరీస్‌లో 75 సగటుతో మొత్తం 521 పరుగులు చేసి, మూడు శతకాలు నమోదు చేసిన పుజారా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. ఓ సందర్భంలో పుజారా మాట్లాడుతూ.. "నా క్రికెట్ కెరీర్‌లో 2018-19 బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ అత్యుత్తమ సిరీస్. అప్పుడు నేను బ్యాటింగ్ చేసిన విధానం, ఏకాగ్రత బాగుంది. ఆ సిరీస్‌లో శారీరకంగా, మానసికంగా చాలా ఒత్తిడి ఎదుర్కొన్నాను" అని చెప్పుకొచ్చాడు.
