
హైదరాబాద్: టీమిండియా నయా వాల్ ఛటేశ్వర్ పుజారా శనివారం 32వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పుజారా పుట్టినరోజు సందర్భంగా ఒక ట్వీట్ మాత్రం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఆ ట్వీట్ చేసింది మరోవరో కాదు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్. పుజారా పుట్టినరోజు సందర్భంగా సచిన్ టెండూల్కర్ గుజరాతీ భాషలో అతడికి శుభాకాంక్షలు తెలిపాడు. "పుజారాను ఔట్ చేయాలంటే పూజారి ఆశీర్వాదాలు కావాలి. హ్యాపీ బర్త్‌డే పుజారా" అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.
మరోవైపు బీసీసీఐ తన ట్విట్టర్‌లో "అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్‌కు, ప్రశాంతతకు మారుపేరైన పుజారాకు జన్మదిన శుభాకాంక్షలు" అంటూ పుజారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. వృద్దిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్, అశ్విన్, మహ్మద్ కైఫ్, తదితర క్రికెటర్లు పుజారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉంటే, పుజారా టీమిండియా తరుపున ఇప్పుటివరకు 75 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 5741 పరుగులు సాధించగా అందులో 18 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫిబ్రవరి 21 నుంచి న్యూజిలాండ్‌లో జరగబోయే టెస్టు సిరీస్‌లో పుజారా టీమిండియా తరుపున బరిలోకి దిగనున్నాడు.
కివీస్ గడ్డపై పుజారా ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 60 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఈసారి న్యూజిలాండ్ పర్యటనలో పుజారా మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తున్నాడు.