
టీమిండియా వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా ఎట్టకేలకు తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. చాలా కాలంగా ఫామ్ కోల్పోయి టీమిండియాకు దూరమైన పుజారా తాజాగా ఫామ్‌లోకి వచ్చాడు. కౌంటీ క్రికెట్‌లో భాగంగా ససెక్స్ తరఫున బరిలోకి దిగిన పుజారా తొలి టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. డబుల్ సెంచరీ సాధించడమే కాకుండా తన జట్టును ఓటమి నుంచి రక్షించాడు. టీమిండియాకు దూరమవడం, ఐపీఎల్‌లో ఏ జట్టులో చోటు దక్కకపోవడంతో పుజారా ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని కౌంటీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. ఇందులో భాగంగానే ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇక డెర్బీషైర్‌తో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్భుతంగా పుంజుకున్నాడు. హాఫ్ సెంచరీ కాదు, సెంచరీ కాదు, ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేశాడు. 23 ఫోర్లతో 387 బంతుల్లో 201 పరుగులు చేసిన పుజారా నాటౌట్‌గా నిలిచాడు. పుజారాకు తోడు కెప్టెన్ టామ్ హైన్స్ (243) కూడా డబుల్ సెంచరీతో చెలరేగాడు.
ఈ ఇద్దరి అద్భుత ఇన్నింగ్స్‌తో ససెక్స్ ఓటమి నుంచి గట్టిక్కింది. టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డెర్బీషైర్ 505-8 వద్ద డిక్లేర్ చేసింది. కాగా ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. ఇక టెస్టు మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ససెక్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 513 పరుగులు చేసింది.
కాగా చాలా కాలంగా ఫామ్ కోల్పోయి పరుగులు చేయని చటేశ్వర్ పుజారాకు ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియాలో చోటు దక్కలేదు. పుజారాతోపాటు రహానేకు కూడా చోటు దక్కలేదు. దీంతో కౌంటీల్లో రాణించి మళ్లీ టీమిండియాలోకి తిరిగి రావాలని పుజారా భావిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 95 టెస్ట్ మ్యాచ్‌లాడిన పుజారా 43 సగటుతో 6713 పరుగులు చేశాడు. ఇందులో 32 హాఫ్ సెంచరీలు, 18 సెంచరీలు ఉన్నాయి. మూడు సార్లు డబుల్ సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. అత్యధిక స్కోర్ 206 పరుగులుగా ఉంది.