
ప్రస్తుత టీమిండియా లైనప్ కాంబినేషన్ వర్కవుట్ కావట్లేదని, జట్టులోకి అక్షర్ పటేల్, మరో పేసర్ రావాలని భారత బ్యాటర్ చటేశ్వర్ పుజారా తెలిపాడు. రవీంద్ర జడేజా దూరం కావడంతో భారత టీమ్ మేనేజ్‌మెంట్ సరైన తుది జట్టును ఎంపిక చేసుకునే విషయంలో చాలా గందరగోళానికి గురవుతుంది. గత కొన్ని నెలలుగా ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా లాంటి ప్లేయర్లను జట్టుకు ఓపెనర్లుగా ఉపయోగిస్తున్నారు. అయితే వీళ్లలో సూర్య మినహా మిగతా ప్లేయర్లు తుది జట్టులో ఉండే అవకాశాలు 50 - 50గా ఉన్నాయి. ఇక ఇషాన్ కిషన్ ఆసియా కప్ టోర్నీకే ఎంపిక కాని సంగతి తెలిసిందే.
ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు మూడు మార్పులు చేసింది. వాటిలో రవీంద్రా జడేజా గాయం కారణంగా, అవేష్ ఖాన్ జ్వరం కారణంగా జట్టుకు దూరమవ్వాల్సి వచ్చింది. అయితే వారి ప్లేసులో దీపక్ హుడా, రవిబిష్ణోయ్ జట్టులోకి రాగా, దినేష్ కార్తీక్ ప్లేసులో పంత్ వచ్చాడు. బాబర్ ఆజామ్ సారథ్యంలోని పాక్ ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించడంతో.. ఆసియా కప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. దీంతో శ్రీలంకతో జరిగే పోరు భారత్‌కు చాలా కీలకంగా మారింది. ఓడిపోతే ఫైనల్ చేరుకునే అవకాశాన్ని ఇండియా కోల్పోతుంది. ఇక ESPNCricinfoలో చటేశ్వర్ పుజారా పాల్గొనగా.. మంగళవారం శ్రీలంకతో జరిగే పోరులో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకుంటారా అని పూజారాను హోస్ట్ అడిగారు. దీనిపై పుజారా స్పందిస్తూ.. టోర్నమెంట్‌లో ప్రస్తుత కాంబినేషన్ పని చేయడం లేదని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. మరో బౌలింగ్ ఆల్‌రౌండర్ రావాలని తాను కోరుకుంటున్నట్లు పుజారా చెప్పాడు. జట్టులో మూడో సీమర్‌ను కూడా ఉపయోగించాలని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా బాగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. పేస్ ఆల్ రౌండర్‌ను పూర్తి కోటా బౌలింగ్ వేసేలా అన్ని టైంలలో ప్రయోగించలేమని చెప్పాడు.