IPL 2021: ఆ జట్టు నన్ను తీసుకోలేకపోవడం ఎంతో బాధించింది: పుజారా

చెన్నై: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా.. సుదీర్ఘ విరామం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున ఆడేందుకు పుజారా సన్నద్ధం అవుతున్నాడు. ఈసారి వేలంలో పుజారాను రూ. 50 లక్షల కనీస ధరకు సీఎస్‌కే దక్కించుకుంది. దాంతో అతని సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కేవలం టెస్టు ప్లేయర్ ముద్ర కారణంగానే గత ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో పుజారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోగా.. చివరకు సీఎస్‌కే అతన్ని దక్కించుకుంది.

టెస్టు ప్లేయర్‌ను కాదని:
చివరిసారి 2014లో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన చతేశ్వర్ పుజారా.. 2011 నుంచి 2013 వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ప్రాతినిథ్యం వహించాడు. ఏడేళ్ల నుంచి ప్రతీసారి వేలంలో తన పేరును నమోదు చేసుకుంటున్నా.. ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబరచలేదు. తాను టెస్టు ప్లేయర్‌నే కాదని, అన్ని ఫార్మాట్లు ఆడే సత్తా ఉందని పదేపదే మొత్తుకున్నా.. పుజారాను ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి సీఎస్‌కే తీసుకోవడంతో పుజారా తన ఆటకు పదును పెట్టే పనిలో పడ్డాడు. ఇప్పటికే చెన్నై శిబిరంలో చేరి ముమ్ముర సాధన చేస్తున్నాడు.

చాలా నిరాశపరిచింది:
తాజాగా చతేశ్వర్ పుజారా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... '2016, 2017 సీజన్లలో పాల్గొన్న గుజరాత్ లయన్స్ నన్ను తీసుకోలేకపోవడం ఎంతో బాధించింది. నా హోమ్ టౌన్ (రాజ్‌కోట్)లో ఆడాలనే కోరిక ఉండేది. గుజరాత్ లయన్స్ నన్ను కచ్చితంగా తీసుకుంటుందని ఆశించా. రెండు సీజన్ల వేలంలో కొనుగోలు చేయకపోవడం చాలా నిరాశపరిచింది. ఒకవేళ అప్పుడు వారు నన్ను తీసుకుని హోమ్ టౌన్‌లో ఆడే అవకాశాన్ని ఇచ్చి ఉంటే బాగుండేది. ఏదేమైనా అదంతా గతం. ప్రస్తుతం ఏమి చేయాలనే దానిపై దృష్టిపెట్టా' అని తెలిపాడు

చివరిసారి పంజాబ్ తరఫున:
చివరి మ్యాచ్ ఎవరితో ఆడారో గుర్తుందా అనే ప్రశ్నకు చతేశ్వర్ పుజారా ఇలా అన్నాడు. 'నేను కింగ్స పంజాబ్ తరఫున చివరిసారి ఆడాను. ముంబై ఇండియన్స్‌తో వాంఖేడ్‌లో జరిగిన మ్యాచ్ అది. వరల్డ్ బెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్‌లో తిరిగి ఆడబోతుండటం సంతోషాన్ని ఇచ్చింది' అని పేర్కొన్నాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టోర్నీ మొదటి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications