
హైదరాబాద్: భారత టెస్టు జట్టులో చోటుపై ఎటువంటి అభద్రత భావం లేదని ఛటేశ్వర్ పుజారా అన్నాడు. ఉపఖండంలో పుజారా భారీ స్కోర్లు చేస్తూ జట్టుకు అండగా నిలుస్తాడు. దీంతో భారత్‌లో అతడి సగటు 50కి పైనే ఉంది. అదే ప్రదర్శనను విదేశాల్లో చూపించడంలో పూర్తిగా విఫలమవుతున్నాడు.
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు ముందు ఎసెక్స్ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పుజారా పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుజారా మాట్లాడుతూ "నేను ఇంగ్లాండ్‌లో చాలా క్రికెట్ ఆడాను. ప్రత్యేకించి కౌంటీ క్రికెట్. 2014 సిరీస్‌లో ఆడిన అనుభవం ఉంది. ఇక్కడి పరిస్థితులు నాకు చాలా బాగా తెలుసు" అని అన్నాడు.
"ఇక నా బ్యాటింగ్ ఆర్డర్, జట్టులో చోటు గురించి నాకు భయం లేదు. నేనేంటో ఇప్పటికే రుజువు చేసుకున్నాను. భారత జట్టులో చోటుకు నేను పూర్తి అర్హుడినని చాటుకున్నాను. గత సీజన్లో నేను బాగా రాణించాను. జట్టుకు నా వంతుగా చేయాల్సిందంతా చేశాను. నా సహచరులు, జట్టు మేనేజ్‌మెంట్ దాన్ని గుర్తించారు" అని పుజారా పేర్కొన్నాడు.
"తుది జట్టులో చోటు విషయంలో నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. నేను కూడా అన్ని ఫార్మాట్లలో ఆడాలనే అనుకుంటా. ఐతే టెస్టులతో పోలిస్తే మిగతా ఫార్మాట్ల ఆట భిన్నమైంది. వన్డేల్లో రాణించిన వాళ్లు టెస్టుల్లోనూ బాగా ఆడగలరని గ్యారెంటీ ఏమీ లేదు" అని తెలిపాడు. వన్డే, టీ20 ఆడే క్రికెటర్లతో తనకు పోటీ లేదని టెస్టులకు ప్రత్యేకమైన మానసిక స్థితి అవసరమని పుజారా తెలిపాడు.
"నా కెరీర్ ఆరంభంలోనే భారత్‌లో ఆడిన టెస్టుల్లో వరుసగా డబుల్ సెంచరీలు కొట్టేశా. ఇంగ్లండ్‌లో కూడా అలాగే ఆడేద్దామనుకున్నా. డబుల్ సెంచరీలు సులువే అనుకున్నా. కానీ అక్కడ అలాంటి మానసిక స్థితిలో ఆడటం సరికాదని తర్వాత అర్థమైంది. మనం ఏ మైలురాయిని అందుకున్నామన్నది కాదు.. జట్టుకు మంచి స్కోరు అందించామా లేదా అన్నదే ముఖ్యం" అని తెలిపాడు.
"అన్నిసార్లూ భారీ స్కోర్లే చేయాల్సిన పని లేదు. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ముఖ్యం. ప్రస్తుత కౌంటీ సీజన్లో నేను మరింత మెరుగ్గా ఆడాల్సింది. ఈసారి కౌంటీలకు వెళ్లినపుడు చాలా ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. మధ్యలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు కోసం భారత్‌కు వచ్చి వెళ్లాల్సి వచ్చింది. అది నా లయను కొంచెం దెబ్బ తీసింది" అని పుజారా పేర్కొన్నాడు.
"అయితే ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఇలాంటి సవాళ్లన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఇంగ్లండ్ పిచ్‌లు సవాలు విసురుతాయనడంలో సందేహం లేదు. ఇక్కడ భిన్నమైన టెక్నిక్, మానసిక స్థితితో ఉండాలి" అని పుజారా పేర్కొన్నాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.