ఐదో భారత క్రికెటర్: సచిన్, ద్రవిడ్‌ల సరసన పుజారా
విశాఖపట్నం: టెస్టు క్రికెట్‌లో ద్రవిడ్ వారసుడిగా పేరు తెచ్చుకున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ ఛటేశ్వరు పుజారా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
అంతేకాదు టెస్టుల్లో అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా పుజారా నిలిచాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ ద్వారా తన కెరీర్‌లో 67వ ఇన్నింగ్స్ ఆడిన పుజారా మూడు వేల పరుగుల మార్కుని అందుకున్నాడు.

67 ఇన్నింగ్స్‌ల్లోనే మూడు వేల పరుగులు
అంతకుముందు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లు కూడా 67 ఇన్నింగ్స్‌ల్లోనే మూడు వేల పరుగులను పూర్తి చేసుకోవడం విశేషం. తాజాగా పుజారా ఆ ఇద్దరి ఆటగాళ్ల సరసన చేరాడు. కాగా భారత్ తరుపున టెస్టుల్లో అత్యంత వేగంగా మూడు వేల పరుగుల మైలురాయిని సాధించిన ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్.

తొలి స్ధానంలో డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్
టీమిండియా డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ 55 ఇన్నింగ్స్‌ల్లో మూడు వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుని ఈ ఘనతను వేగంగా సాధించిన భారత ఆటగాళ్లలో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్(64ఇన్నింగ్స్ లు), గవాస్కర్(66 ఇన్నింగ్స్ లు)లు ఉన్నారు.

కోహ్లీకి 73 ఇన్నింగ్స్‌లు
టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించి సచిన్ వారుసుడిగా మన్ననలు అందుకుంటున్న టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడు వేల పరుగులను చేరడానికి 73 ఇన్నింగ్స్‌లు పట్టడం విశేషం. ఇక టెస్టుల్లో మూడు వేల పరుగుల మైలురాయి చేరుకునేందుకు పుజారాకు 40 టెస్టులు పడితే, మురళీ విజయ్‌కి 44 టెస్టులు పట్టాయి.

కోహ్లీతో చక్కని భాగస్వామ్యం
ఇందులో భాగంగా పుజారా టెస్టుల్లో పదో సెంచరీని నమోదు చేయగా, 10 అర్ధ సెంచరీలు సాధించాడు. విశాఖ టెస్టులో 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన పుజారా కెప్టెన్ కోహ్లీతో చక్కని ఇన్నింగ్స్ ఆడి ఛటేశ్వర పుజారా సెంచరీ సాధించాడు. 184 బంతులు ఎదుర్కొన్న పూజారా 11 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో సెంచరీని సాధించాడు.

సిక్స్‌తో సెంచరీని సాధించిన పుజారా
టెస్టుల్లో పుజారాకి ఇది పదో సెంచరీ. పూజారా 99 పరుగుల వద్ద ఉన్న సమయంలో సిక్స్‌తో సెంచరీని సాధించాడు. జట్టు స్కోరు 248 పరుగుల వద్ద పుజారా (119) అండర్సన్ బౌలింగ్‌లో క్యాచ్ బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో జట్టులో స్థానం కోల్పోయిన పుజారా.. ది వాల్ ద్రవిడ్ దగ్గర చిట్కాలు తీసుకున్నాడు.

మూడు టెస్టుల్లో మూడు సెంచరీలు
తద్వారా దేశవాళీ మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ.. మరో డబుల్ సెంచరీతో తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. అప్పట్నుంచి అద్భుతమైన ఫామ్‌లో కొనసాగిస్తున్నాడు. గత ఐదు టెస్టుల్లో పుజారా వరుసగా 62, 78, 87, 4, 41, 101 నాటౌట్, 124, 18, 119 ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. గత మూడు టెస్టుల్లో వరుసగా 3 సెంచరీలు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications