
హైదరాబాద్: 'దవాల్' రాహుల్ ద్రవిడ్ తర్వాత టెస్టుల్లో సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌లు ఆడగల వ్యక్తి ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఛటేశ్వర్ పుజారా. ఆసీస్ గడ్డపై 70 ఏళ్ల కలను నిజం చేయడంలో పుజారా కీలకంగా వ్యవహారిస్తున్నాడు. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా తన స్టామినా ఏంటో మరోసారి తెలిసేలా చేశాడు.
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన చివరి టెస్టులో అసలు సిసలు టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరిస్‌లో ఆసీస్ బౌలర్లను ఎంతో సహనంగా ఎదుర్కొంటూ ఆస్ట్రేలియా గడ్డపై మరో సెంచరీ సాధించాడు. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడు సెంచరీలు చేసి తనకు తానే సాటి నిరూపించుకున్నాడు.
నాలుగో టెస్టు మ్యాచ్‌లో కేవలం 199 బంతుల్లోనే 13 ఫోర్ల సాయంతో ఛటేశ్వర్ పుజారా సెంచరీ సాధించాడు. స్టార్క్ బౌలింగ్‌లో బంతిని బౌండరీకి పంపడంతో పుజారా 100 పరుగులను పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 18వ సెంచరీ కాగా, ఈ సిరిస్‌లో మూడోది కావడం విశేషం.
అడిలైడ్ టెస్టు, మెల్‌బోర్న్ టెస్టులోనూ పుజారా సెంచరీ సాధించగా.. ఆ రెండు టెస్టులోనూ భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిడ్నీ టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) ఘోరంగా విఫలమవ్వడంతో రెండో ఓవర్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో కలిసి భారత్‌కు కీలక భాగస్వామ్యాన్ని అందించాడు.
రెండో వికెట్‌కు మయాంక్‌తో కలిసి 116 పరుగులు జోడించి భారత్‌ను భారీ స్కోరు వైపు నడిపించాడు. హాఫ్ సెంచరీ అనంతరం మయాంక్ అగర్వాల్ 112 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాక నాథన్ లియోన్ బౌలింగ్‌లో మిషెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (23) జట్టు స్కోరు 180 వద్ద మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రహానే (18)తో కలిసి పుజారా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే కీలక సమయంలో కోహ్లీ, రహానే ఔటైనా... పుజారా మాత్రం నిలకడగా ఆడుతూ సెంచరీ సాధించాడు.
కెరీర్‌లో 68వ టెస్ట్ ఆడుతున్న పుజారాకు ఇది టెస్టుల్లో 18వ సెంచరీ కాగా, ఆస్ట్రేలియాపై మొత్తంగా ఐదోది. ప్రస్తుత సిరీస్‌లో మూడోది. ఈ క్రమంలో పుజారా ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
చివరకు తొలి రోజు ఆట ముగిసే సరికి 250 బంతుల్లో 130 పరుగులతో పుజారా నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజెల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా... లియాన్, స్టార్క్ చెరో వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా సిరిస్‌లో పుజారా సెంచరీలు:
అడిలైడ్ టెస్ట్ : 123 (246 బంతులు )
మెల్‌బోర్న్ టెస్ట్ : 106 (319 బంతులు)
సిడ్నీ టెస్ట్ : 130 నాటౌట్ (250 బంతులు)