భార్యల కన్నా.. ఇతర బ్యాట్స్‌మెనే నమ్మకస్తులు భయ్యో!!

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి దాదాపు రెండు నెలలు కావొస్తోంది. ఈ నేపథ్యంలో బయట సెలూన్లు తెరవక పురుషుల జుట్టు, గడ్డాలు పెరిగిపోయాయి. అయితే పెరిగిన జట్టును కొంతమంది తామే కట్ చేసుకుంటే.. మరికొందరు ఆ పనిని వారి జీవిత భాగస్వాములకు అప్పగిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తన సతీమణి అనుష్క శర్మ ఇంట్లోనే హెయిర్ కట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొట్టింది.

పుజారా హెయిర్ కట్ చేసిన పూజా:
తాజాగా టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఛతేశ్వర పుజారా భార్య పూజా పబారి.. అనుష్క శర్మను ఫాలో అయ్యారు. ఇంట్లోనే తన భర్తకు హెయిర్ కట్ చేశారు. ఓ కత్తెర తీసుకుని పుజారా జుట్టును పబారి కట్ చేసారు. ఈ విషయాన్ని పుజారా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిస్తూ ఓ ఫొటో పంచుకున్నాడు. 'సెంచరీకి ఒక్క పరుగు (99*) దూరంలో ఉన్నప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ను ఎంతగా నమ్ముతాము అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ.. అదే జీవిత భాగస్వామితో హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అదే నమ్మకం ఉంటుందని దైర్యంగా చెప్పడం మాత్రం చాలా కష్టం' అని క్యాప్షన్ పుజారా పెట్టాడు.

భార్యల కన్నా.. ఇతర బ్యాట్స్‌మెనే నమ్మకస్తులు:
పుజారా పోస్టుకు సౌరాష్ట్ర సహచర ఆటగాడు జయదేవ్ ఉనద్కట్ మంకీతో కూడిన ఒక ఎమోజీని పెట్టి పుజారతో నేను కూడా ఏకీభవిస్తా అంటూ కామెంట్ చేశాడు. మరోవైపు పుజారా అభిమానులు ఫన్నీ కామెంట్లతో అలరించారు. 'ఈ పోస్టు పెట్టడమే అతిపెద్ద సాహసోపేతం' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'భార్యల కన్నా.. ఇతర బ్యాట్స్‌మెనే నమ్మకస్తులు' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. పుజారా బయ్యా చాలా సాహసం చేసావ్ అని మరొకరు అన్నారు.

జుట్టు పోతే మళ్లీ పెరుగుతుంది:
'జుట్టు పోతే మళ్లీ పెరుగుతుంది, కానీ టెస్టుల్లో 99 పరుగులు చేయాలంటే చాలా కష్టం', '99 పరుగుల వద్ద బ్యాటింగ్ చేయడమనేది మీ చేతుల్లో ఉంటుంది. ఎలాగైనా బతికిపోవచ్చు. కానీ ఇక్కడ మరో అవకాశం ఉండదు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. అవతలి వారి నిర్ణయాలను ఒప్పుకోక తప్పదు', 'పుజారా సర్.. త్వరగా సింగిల్ తీస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఒకవేళ ఔటైనా అవతలి వ్యక్తిపై అరవొచ్చు. ఇక్కడైతే మన నోరు మూసుకోవాల్సిందే' అని అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. టీమిండియా తరపున 77 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన చటేశ్వర్ పుజార 48.86 సగటుతో 5,840 పరుగులు చేశాడు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 18 సెంచరీలు, 25 అర్థ సెంచరీలున్నాయి.

భార్య కోసం కోచ్‌గా మారిన పుజార:
లాక్‌డౌన్ సందర్భంగా చతేశ్వర పుజారా ఇంట్లోని పనులతో బిజీబిజీగా గడుపుతున్నాడు. మరోవైపు ఖాళీ సమయమంతా కుటుంబంతో గడుపుతున్నాడు. ఈ క్రమంలో పుజార బ్యాడ్మింటన్ కోచ్ అవతారమెత్తాడు. తన భార్య పూజ కోసం పుజారా కోచ్‌గా మారాడు. పుజారా తన భార్య పూజకు కొన్ని బ్యాడ్మింటన్ పాఠాలు ఇస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. వీడియోలో ఇద్దరూ కలిసి తన ఇంట్లోని లాన్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications