Cheteshwar Pujara Love Story: భారత స్టార్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అభిమానులను కాస్త నిరాశపరిచినా.. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఆయన భార్య పూజ పాబరీతో అతని అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఒక సాధారణ అరేంజ్డ్ మ్యారేజ్ లాగా మొదలైన వీరి బంధం కేవలం 90 నిమిషాల సంభాషణతో జీవితాంతం కలిసి ఉండాలనే నిర్ణయానికి దారితీసింది.
వారిద్దరి పరిచయం వారి కుటుంబ మిత్రుల ద్వారా జరిగింది. మొదటి సారి కలిసినప్పుడు పూజ పుజారాలోని నిజాయితీని, మంచి మనసుని చూసి ముగ్ధురాలయ్యారు. కేవలం 90 నిమిషాల్లోనే వారి ఆలోచనలు, ఇష్టాలు, అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని గ్రహించారు. సాధారణంగా పెళ్లి చూపులలో గంటల తరబడి మాట్లాడుకున్నా ఒకరికొకరు నచ్చని సందర్భాలు ఉంటాయి, కానీ పుజారా, పూజల విషయంలో మాత్రం ఆ 90 నిమిషాలే వారి జీవితాలను మార్చేశాయి. ఈ తొలి పరిచయం గురించి పూజ మాట్లాడుతూ, "మా మధ్య అంతా చాలా సహజంగా జరిగింది. ఒకరికొకరు మంచి స్నేహితుల్లాగా అనిపించింది" అని చెప్పారు. అయితే, ఇది తొలిచూపులోనే ప్రేమ కాదని నవ్వుతూ స్పష్టం చేశారు.

బంధం బలపడిన తర్వాత పెళ్లి
ఆ 90 నిమిషాల సంభాషణ తర్వాత పుజారా, పూజ తమ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 6, 2012న వీరిద్దరికీ నిశ్చితార్థం జరగగా.. ఫిబ్రవరి 13, 2013న సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగింది. ఫిబ్రవరి 23, 2018న ఈ జంటకు అదితీ అనే ఒక అందమైన కుమార్తె జన్మించింది. పుజారా క్రికెట్ కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నప్పుడు, పూజ ఎప్పుడూ అతనితో తోడుగా ఉంటూ అండగా నిలిచారు.
పూజ పాబరీ.. ఒక వ్యాపారవేత్త, రచయిత్రి
పూజ పాబరీ పుజారా కన్నా ఆరేళ్లు చిన్నది. పూజ సెప్టెంబర్ 16, 1993న పుట్టారు. ఆమె ఒక ఉన్నత విద్యావంతురాలు, వృత్తిపరంగా కూడా ఎంతో టాలెంటెడ్. ఆమె రిటైల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేసి, ఒక హెచ్‌ఆర్ హెడ్‌గా కూడా పనిచేశారు. ఇంటీరియర్ డిజైనింగ్‌పై ఉన్న ఆసక్తితో శిక్షణ పొంది, ప్రస్తుతం 'ది గ్రేట్ ఈస్టర్న్ కేర్‌గివర్స్' అనే వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, ఆమె వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటూ సమాజ సేవకు కూడా తోడ్పడుతున్నారు. 2025లో పూజ నమిత కాలాతో కలిసి 'ది డైరీ ఆఫ్ ఎ క్రికెటర్స్ వైఫ్: ఏ వెరీ అన్‌యూజువల్ మెమోయిర్' అనే పుస్తకాన్ని రచించి ప్రచురించారు. ఈ పుస్తకం ఒక క్రికెటర్ భార్యగా ఆమె జీవిత అనుభవాలను, సవాళ్లను వివరిస్తుంది.