
గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన తర్వాత జట్టు ఎంపికపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత జరిగిన న్యూజిల్యాండ్ సిరీస్‌లో కూడా అర్హత కలిగిన చాలా మంది యువ ఆటగాళ్లకు సెలెక్షన్ కమిటీ మొండిచెయ్యి చూపింది. దీంతో పదవీ కాలం పూర్తికాక ముందే బీసీసీఐ సెలెక్షన్ కమిటీపై వేటు వేసింది. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజర్ బిన్నీ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సెలెక్షన్ కమిటీ చీఫ్ చేతన్ శర్మ సహా మొత్తం కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
సెలెక్షన్ కమిటీ రద్దు చేసినప్పటికీ కొత్తగా కమిటీలో చేరేందుకు సీనియర్ ఆటగాళ్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. సెలెక్షన్ కమిటీ పదవుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. బీసీసీఐ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఈ క్రమంలో వచ్చే సారి కూడా సెలెక్షన్ కమిటీ పగ్గాలను చేతన్ శర్మకే అప్పగించాలని బీసీసీఐ భావిస్తోందట. అతనితోపాటు హర్వీందర్ సింగ్ కూడా సెలెక్షన్ కమిటీలో కొనసాగనున్నాడు. బీసీసీఐ ఏర్పాటు చేసిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఈ పదవుల కోసం కొందరిని ఇంటర్వ్యూ చేసింది.
వీరిలో చేతన్ శర్మ, హర్వీందర్ సింగ్, అమయ్ ఖురేషియా, అజయ్ రాత్రా, ఎస్ఎస్ దాస్, ఎస్ శరత్, కానర్ విలియమ్స్ తదితరులు ఉన్నారు. ఈ ఇంటర్వ్యూల అనంతరం సీఏసీ తాము షార్ట్ లిస్ట్ చేసిన వారి పేర్లను బీసీసీఐకి సమర్పించిందట.
దీనిలో చేతన్ శర్మ స్థానాన్ని భర్తీ చేయడంలో ఫ్రంట్ రన్నర్‌గా ఉన్నాడని అంతా భావించిన వెంకటేశ్ ప్రసాద్ పేరు లేకపోవడం గమనార్హం. 2020లో చేతన్ శర్మ నేతృత్వంలో సెలెక్షన్ కమిటీ ఏర్పాటైంది. అయితే చైర్మన్‌గా చేతన్ శర్మ పదవీ కాలం ముగియకముందే 2022లో ఈ కమిటీని రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కానీ వచ్చే సారి కూడా అతనే సెలెక్షన్ కమిటీ చీఫ్‌గా ఉండబోతున్నాడని తెలుస్తోంది.