
టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయని వచ్చిన వార్తలను సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ఖండించారు. నిజానికి అలాంటి ప్రచారాలన్నీ అవాస్తమని కొట్టి పారేశారు. అలాంటి వార్తలన్నీ పని లేని వారు పుట్టించేవి అన్నారు. ఆ వార్తలను విని తనలో తాను నవ్వుకునే వాడినని ఆయన చెప్పారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా సున్నిహితంగా ఉంటారని, ఒకరి కెప్టెన్సీలో మరొకరు ఆడడానికి ఇష్టపడతారని ఆయన తెలిపారు. అంతేకాకుండా జట్టుకు సంబంధించిన విషయాలను కలిసి చర్చిస్తారని చేతన్ శర్మ వివరించారు.
కోహ్లీ కెప్టెన్సీ వివాదం గురించి కూడా ఆయన పలు విషయాలు వెల్లడించారు. అంతేకాకుండా సెలెక్టర్లపై కోహ్లీ చేసిన వ్యాఖ్యలకు కూడా ఆయన వివరణ ఇచ్చారు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలో తనను ఎవరూ వద్దని చెప్పలేదని కోహ్లీ చేసిన వ్యాఖ్యలను చేతన్ శర్మ ఖండించారు. కోహ్లీ మాటల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. బీసీసీఐలోని ప్రతి సెలెక్టర్ సహా ఆఫీస్ బెరర్స్, సెలక్షన్ కమిటీ కన్వీనర్, ఇతర స్టాఫ్ మొత్తం కోహ్లిని కలిసి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోరినట్లు తెలిపారు. కానీ కోహ్లీ తమ మాట పట్టించుకోకుండా టీ20 ప్రపంచకప్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడని వివరించారు. మరోసారి పునరాలోచించుకోవాలని కోరిన కోహ్లీ పట్టించుకోలేదని చెప్పారు. ఇక అప్పటికే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీని అన్ని విధాలుగా ఆలోచించే ప్రపంచకప్ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించినట్లు వివరించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్‌లు ఉంటే టీంలో సమతుల్యం దెబ్బతింటుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అంతేకానీ ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పారు. కెప్టెన్‌గా ఎవరు ఉన్నా జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టడమే లక్ష్యమన్నారు. కోహ్లీ, బీసీసీఐకి మధ్య ఎలాంటి వివాదం లేదని వివరణ ఇచ్చారు.
ఇక టీమిండియా విషయానికొస్తే ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో జట్టు బిజీగా ఉంది. ఇప్పటికే సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచి 1-0తో అధిక్యంలో ఉంది. దీంతో సోమవారం నుంచి జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ప్రాక్టీసు మొదలు పెట్టింది. ప్రస్తుతం జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగానే కనిపిస్తున్నప్పటికీ సీనియర్ ఆటగాళ్లైనా విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పుజారా, అంజిక్యా రహానే ఫామే కలవర పెడుతోంది. దీంతో జోహన్నెస్ బర్గ్ టెస్ట్ మ్యాచ్‌లోనైనా వీళ్లు గాడిలో పడాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.