ఐపీఎల్ మినీ వేలం ఎవరి ఊహలకు అందలేదు. రికార్డు ధరలు నమోదయ్యాయి. మిచెల్ స్టార్క్ ఆల్‌టైమ్ రికార్డు ధర పలికాడు.రూ24.75 కోట్లకు అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.కమిన్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లు వెచ్చించింది. అలాగే కొంతమంది కుర్రాళ్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. సమీర్ రిజ్వీ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ. 8.40 కోట్లు ఖర్చు పెట్టింది.
ఇప్పటివరకు ఐపీఎల్ ఆడని ఆటగాళ్లలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా సమీర్ రిజ్వీ రికార్డు సృష్టించాడు. అయితే స్టార్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్, న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రల కోసం రూ. 5.80 కోట్లు ఖర్చు పెట్టిన సీఎస్‌కే.. ఓ కుర్రాడి కోసం రూ. 8.40 కోట్లు పెట్టింది. దీంతో సమీర్ రిజ్వీ ఎవరు? అతడి నైపుణ్యాలేంటి అనే చర్చ మొదలైంది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీ దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటాడు. అతడిని 'రైట్ హ్యాండెడ్ సురేశ్ రైనా'గా పిలుస్తారు. రోహిత్ శర్మలా పుల్ షాట్లను ఈజీగా బాదగలడు. అలాగే రింకూ సింగ్‌లా మ్యాచ్‌ను ఫినిష్ చేయగలడు. ఇక ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీలో అతడు 139.89 స్ట్రైకింగ్‌తో బ్యాటింగ్ చేశాడు. సగటున అతడు ఎదుర్కొన్న ప్రతి 11 బంతుల్లో ఒక సిక్సర్ కొట్టాడు.
యూపీ టీ20 లీగ్‌లో వ్యక్తిగత అత్యధిక స్కోరుతో పాటు ఫాస్టెస్ట్ సెంచరీ బాదాడు. 188 స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. ఆ లీగ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ రిజ్వీనే. యూపీ టీ20 లీగ్‌లో సమీర్ రిజ్వీ 455 పరుగులు, 35 సిక్సర్లు సాధించాడు. అలాగే మెన్స్ అండర్-23 స్టేట్ A ట్రోఫీలో 454 పరుగులు చేశాడు. దీనిలో 37 సిక్సర్లు కొట్టాడు.కాగా, ఐపీఎల్ భారీ ధర పలకడంతో రిజ్వీ ఎమోషనల్ అయ్యాడు. తన సక్సెస్‌లో అతని మేనమామ తన్కీబ్ ప్రధాన పాత్ర పోషించాడని చెప్పాడు.
''మామ ఎప్పుడూ నాతోనే ఉండేవాడు. గత 14 ఏళ్లలో ఆయన గ్రౌండ్‌లో నాతో లేని రోజులు కేవలం 14 రోజులు ఉండవచ్చు. నాపై నా కంటే ఆయనకే నా మీద నమ్మకం ఎక్కువ. ఐపీఎల్ వేలం చూడమని బలవంతంగా కూర్చొబెట్టాడు. నేను చూడాలనుకోలేదు. కానీ చూసేలా చేశాడు.కానీ ఆయన అలా చేసినందకు తర్వాత సంతోషించా'' అని సమీర్ రిజ్వీ అన్నాడు.
వేలంలో చెన్నై కొనుగోలు చేసిన ప్లేయర్లు: డారిల్ మిచెల్ (రూ. 14 కోట్లు), సమీర్ రిజ్వీ (రూ. 8.40 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (రూ.4 కోట్లు), ముస్తాఫిజుర్ (రూ.2 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.1.80 కోట్లు), అవనీశ్ రావు (రూ.20 లక్షలు)