హైఓల్టేజ్ క్రికెట్ టోర్నమెంట్- ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ఇంకొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. 17వ ఎడిషన్ ఇది. ఈ రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్. గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
చెన్నై చెపాక్‌లో గల ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. హోమ్ పిచ్‌పై గెలిచి తన జైత్రయాత్రను ఇక్కడి నుంచే మొదలుపెట్టాలనే పట్టుదలతో ఉంది సూపర్ కింగ్స్. దీనికి తగ్గట్టుగా ప్లేయింగ్ 11 ఉండబోతోంది. ఆల్ రౌండర్లకు తుదిజట్టులో చోటు దక్కొచ్చు.

చెన్నై సూపర్ కింగ్స్‌కు రుతురాజ్ గైక్వాడ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫాఫ్ డుప్లెసిస్ కేప్టెన్లుగా వ్యవహరించనున్నారు. గత సీజన్ వరకూ సీఎస్‌కే సారథిగా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ సారి ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. కొత్త నాయకత్వంలో ఎల్లో ఆర్మీ ఎలా ఆడబోతోందనేది ఆసక్తి రేపుతోంది.
కొందరు అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. వారి జాబితా పెద్దదే. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర ఐపీఎల్‌లో ఆడబోతోన్నాడు. అతనికి ఇదే తొలి మ్యాచ్ అవుతుంది. ఈ సీజన్‌లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మారాడు. ఓపెనింగ్‌తో పాటు టాప్ ఆర్డర్‌లో ఆడగల సామర్థ్యం ఉన్న ప్లేయర్.
గత ఏడాది భారత్ వేదికగా సాగిన ఐసీసీ వరల్డ్ కప్ 2023తో స్టార్ హోదాను సంపాదించిన ఇండియన్ ఆరిజిన్ బ్యాటర్.. రచిన్ రవీంద్ర. తన కేరీర్‌లో ఆడిన తొలి వరల్డ్ కప్‌లోనే టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌లల్లో 523 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంపాటలో 1.80 కోట్ల రూపాయలకు అతన్ని సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్‌కే ప్లేయింగ్ 11లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. గాయపడ్డ శివం దుబేకు ఐపీఎల్ ఆడటానికి నేషనల్ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చింది. అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనేది అనుమానమే.
బౌలర్లల్లో ముఖేష్ చౌదరి లేదా తుషార్ దేశ్ పాండేకు తుదిజట్టులో చోటు దక్కొచ్చు. గత సీజన్‌లో తుషార్.. సీఎస్‌కే హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మొత్తం 16 వికెట్లను నేల కూల్చాడు తుషార్.
చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తే.. తుది జట్టులో- రుతురాజ్ గైక్వాడ్ (కేప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ ఆడొచ్చు.
సీఎస్‌కే తొలుత ఫీల్డింగ్‌కు దిగితే.. తుదిజట్టులో- రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి/తుషార్ దేశ్‌పాండేకు చోటు దక్కొచ్చు.