
ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా దాదాపు రెండు నెలల సమయం ఉంది. ఇప్పటివరకు మెగా వేలమే ప్రారంభం కాలేదు. కానీ టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నైసూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోని మాత్రం అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. నెట్స్‌లో బ్యాట్ పట్టుకుని శ్రమిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఫోటోలను వైరల్ చేస్తూ ధోని అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. గత సీజన్లో కెప్టెన్‌గా చెన్నైసూపర్ కింగ్స్‌ను ట్రోఫీ గెలిపించినప్పటికీ బ్యాటర్‌గా మాత్రం ధోని అంతగా సక్సెస్ అవ్వలేకపోయాడు. నిజానికి అంతకుముందు సీజన్లో కూడా ధోని బ్యాటర్‌గా విఫలమ్యాడు. 2020 సీజన్లో కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్‌ను ప్లేఆఫ్స్‌కు కూడా చేర్చలేకపోయాడు. ఇలా బ్యాటర్‌గా రెండు సీజన్లుగా విఫలమవడంతో ఈ సారి సత్తా చాటాలని మహీ పట్టుదలగా ఉన్నాడు. దీనికి తోడు ధోని ఆడబోయేది ఇదే చివరి సీజన్ అనే వార్తలు కూడా ఉన్నాయి. అందుకే రెండు నెలలు ముందుగానే ప్రాక్టీస్ మొదలుపెట్టాడని తెలుస్తోంది.
కాగా ఈ సీజన్లో చెన్నైసూపర్ కింగ్స్ మహేంద్రసింగ్ ధోనితోపాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని రిటైన్ చేసుకుంది. రిటెన్షన్ జాబితాలో సీఎస్కే మేనేజ్‌మెంట్ ధోని కంటే రవీంద్ర జడేజాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనున్న ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించి అనుసరించాల్సిన వ్యుహాల విషయమై మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే ఓ సారి చెన్నైసూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌తో భేటీ ఆయ్యాడు. ఈ భేటీలో వేలంలో అనుసరించాల్సిన వ్యూహాల విషయమై మేనేజ్‌మెంట్‌కు ధోని కీలక సూచనలు చేసినట్టు సమాచారం. అంతేకాకుండా మెగా వేలంలో ధోని కూడా చెన్నై తరఫున పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
ఐపీఎల్‌లో ధోని సారథ్యంలో చెన్నైసూపర్‌కింగ్స్ ఇప్పటివరకు 4 సార్లు ట్రోఫీ గెలిచింది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 220 మ్యాచ్‌లు ఆడిన ధోని 39 సగటుతో 4746 పరుగులు చేశాడు. ఇందులో 23 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 84 పరుగులు. ఈ క్రమంలో 325 ఫోర్లు, 219 సిక్స్‌లు బాదాడు. 135 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. రికార్డు స్థాయిల్లో 73 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు.