
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నైసూపర్ కింగ్స్ మహేంద్రసింగ్ ధోని ప్రముఖ తమిళ నటుడు చియాన్ విక్రమ్‌ను కలిశాడు. అయితే వీరిద్దరు కలవడానికి గల కారణం బయటికి రాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వీరిద్దరు కామన్‌గా కలిసినట్టు సమాచారం. ఇక హిరో విక్రమ్.. మహేంద్రసింగ్ ధోని వీరాభిమాని. ఈ క్రమంలో వీరిద్దరు కలిసినట్లు తెలుస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత అయినా విక్రమ్ తాజాగా నటించిన చిత్రం మహాన్ ట్రైలర్ విడుదల అయినా రోజే వీరిద్దరు కలవడం గమనార్హం. దీంతో విక్రమ్ మీద ఉన్న గౌరవంతో మహాన్ చిత్రం ప్రమోషన్స్ కోసం ధోని అతన్ని కలిసి ఉంటాడని చర్చించుకుంటున్నారు. కాగా మహాన్ చిత్రంలో విక్రమ్ తన కొడుకు ధృవ్‌తో కలిసి నటించాడు. అయితే ధోని, విక్రమ్ కలిసి ఫోటోలు కూడా దిగారు. ఈ ఫోటోలను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
కాగా విక్రమ్ అపరిచితుడు, మల్లన్న వంటి తదితర చిత్రాలతో తెలుగు వారికి కూడా సుపరిచితమే. ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు చిత్రంతో తెలుగు వారికి విక్రమ్ బాగా దగ్గరయ్యాడు. ఆ చిత్రంలో విక్రమ్ నటనకి తెలుగు వారు జేజేలు పలికారు. అప్పటి నుంచి విక్రమ్ నటించిన ప్రతి సినిమా తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదల అవుతుంటుంది. అయితే దురదృష్టవశాత్తూ అపరిచితుడు వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత విక్రమ్ మళ్లీ హిట్ అందుకోలేకపోయాడు. కాగా విక్రమ్ కొడుకుతో కలిసి నటించిన మహాన్ చిత్రం ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ అనే ఓటీటీ వేదికగా విడుదల కాబోతుంది.
ప్రస్తుతం చెన్నైలోనే ఉన్న ధోని వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సూపర్ కింగ్స్ జట్టు మేనేజ్‌మెంట్‌తో చర్చిస్తున్నాడు. ప్రస్తుతానికి నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై మేనేజ్‌మెంట్‌తో కలిసి ధోని చర్చిస్తున్నాడు. వేలంలో ఎవరెవరినీ కొనుగోలు చేయాలి, ఎంత డబ్బులు వెచ్చించాలని ధోని సూచనలు ఇస్తున్నాడని సమాచారం. అలాగే ఈ సారి వేలానికి ధోని కూడా హాజరయ్యే అవకాశం ఉంది. కాగా ఈ సీజన్‌లో చెన్నైసూపర్ కింగ్స్‌కు ధోనినే నాయకత్వం వహించనున్నాడు. అలాగే ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆడి ధోని ఐపీఎల్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నాడట. కాగా ధోని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.