విశాఖపట్నం: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నంలో గురువారం జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్ Vs ఇంగ్లాండ్ టెస్టు సిరిస్ ఫోటోలు
పిచ్ పూర్తిగా ఎండిపోయినట్టున్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసి, సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోహ్లీ తెలిపాడు. ఇదిలా ఉంటే మ్యాచ్‌ని ప్రారంభించేందుకు గాను గురువారం ఉదయం సీఎం చంద్రబాబు విశాఖపట్టణానికి చేరుకున్నారు.
తొలుత విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. ఇరు జట్లకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లను చంద్రబాబు సత్కరించారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆంధ్రప్రదేశ్ హబ్‌గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో అంతర్జాతీయ మ్యాచ్‌లు మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. విశాఖ స్టేడియానికి టెస్టు హోదా రావడం సంతోషకరంగా ఉందని అన్నారు.

కపిల్‌దేవ్, వీవీఎస్ లక్ష్మణ్, ఎమ్మెస్కే ప్రసాద్, సునీల్ గవాస్కర్, ఇయాన్‌బోథమ్‌లను సన్మానం అందుకున్న వారిలో ఉన్నారు.
అనంతరం భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ని సీఎం చంద్రబాబు కాసేపు వీక్షించారు. 1953లో ఏర్పడిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో విశాఖపట్నంలో తొలిసారి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటివరకు ఈ స్టేడియంలో వన్డే మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి.
రెండో టెస్టు మ్యాచ్‌కి బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగారాజు, ఏసీఏ అధ్యక్షుడు సోమయాజులు, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ హాజరయ్యారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విశాఖ టెస్టు మ్యాచ్‌పై కూడా పడింది. మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పోటెత్తక పోవడంతో తొలిరోజు క్రీడాభిమానును ఉచితంగానే అనుమతిస్తున్నారు.
మరోవైపు విశాఖ చుట్టుపక్కల స్కూళ్లలోని 10,000 మందికి బాలురు, బాలికలకు ఉచితంగా ఈ మ్యాచ్‌ని వీక్షించే వెసులుబాటుని ఏసీఏ కల్పించింది.